హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో భూములు, ఆస్తులు కోల్పోతున్న వారికి ఆర్బిట్రేటర్లు (జిల్లా కలెక్టర్లు) ఎంత నష్టపరిహారం నిర్ణయిస్తే అంత చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికి 17 మంది రైతులకు నష్టపరిహారం ఖరారు చేశారని, వారిలో కొందరికి ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారని తెలిపారు.
అయితే, అందరికీ ఈ మేరకు నష్టపరిహారం ఇచ్చే వీలులేదని చెప్పారు. దాదాపు 162 కిలోమీటర్ల పొడవైన ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి 1,950 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉన్నది. అందులో దాదాపు 85% భూసేకరణ పూర్తవడంతో చాలావరకు అవార్డులు పాస్ చేసినట్టు ఆర్అండ్బీ శాఖ మంత్రి గతంలోనే వెల్లడించారు.
భూములు, ఇండ్లు, పంటలు తదితర ఆస్తులను కోల్పోతున్న బాధితులకు దాదాపు రూ.5,100 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతోపాటు రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని చెల్లించాలన్న ఉద్దేశంతో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్‌ను ఏర్పా టు చేసింది. దీంతో నష్టపరిహారంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న బాధిత రైతుల్లో ఆర్బిట్రేటర్లను ఆశ్రయించారు. వారి వాదనలు విన్నాక ఆర్బిట్రేటర్లు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తున్నారని అధికారులు చెప్పారు.