హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): లే-అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) స్కీమ్ కింద ఇప్పటివరకు దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 4,28,832 దరఖాస్తులను ప్రాసెస్ చేసి, 60,213 దరఖాస్తులను ఆమోదించామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వెల్లడించారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.96.60 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. మొత్తం దరఖాస్తుదారుల్లో దాదాపు 75% మంది సరైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయకపోవడంతో వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో షార్ట్‌ఫాల్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసే సదుపాయం దరఖాస్తుదారులకు ఉన్నదని పేర్కొన్నారు. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికేట్, లే-అవుట్ కాపీ లాంటి పూర్తిస్థాయి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని తెలిపారు. ఓటీపీని ఉపయోగించుకుని మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర వివరాలను సవరించుకోవచ్చని వివరించారు. ఇతర వివరాల కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లోని హెల్ప్ డెస్కులను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టీస్ పీసీ ఘోష్ విచారణ నేటి(శనివారం) నుంచి పునఃప్రారంభం కానుంది. జస్టిస్ ఘోష్ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. కమిషన్ ఎదుట దాఖలైన అఫిడవిట్లను సైతం పరిశీలించారు. సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశమున్నది.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): అగ్ని మిస్సైల్స్ రూపకర్త, రామ్‌నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. శనివారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన అనారోగ్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గడ్ విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం నియమించిన విచారణ సంఘం ఆచితూచి అడుగులేస్తుంది. ఇప్పటికే విచారణను ప్రారంభించిన విచారణ సంఘం చైర్మన్ జస్టిస్ మదన్ బీ లోకూర్ డాక్యుమెంట్ల పరిశీలనను చేపట్టారు.
జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి అధ్యక్షతన విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయగా, బాధ్యతల నుంచి ఎల్ నర్సింహారెడ్డి తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఉమ్మడి ఏపీ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలో విచారణ సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రెండురోజులపాటు హైదరాబాద్‌కు వచ్చిన జస్టిస్ మదన్ బీ లోకూర్ విచారణ తీరుతెన్నులపై ఆరాతీసినట్టు తెలిసింది. ఇంతకుముందు విచారణ జరిపిన ఎల్ నర్సింహారెడ్డి ఇన్వెస్టిగేషన్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం తదుపరి విచారణపై ముందుకు వెళ్లనున్నట్టు తెలిసింది.
చెన్నై: జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు ఖుష్బూ సుందర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను జూన్ 28 నుంచి వర్తించే విధంగా ఆమోదించినట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాను బీజేపీ కోసం పూర్తి కాలం పని చేయడం కోసం ఎన్సీడబ్ల్యూ మెంబర్ పదవికి రాజీనామా చేశానని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్సీడబ్ల్యూ పదవికి కొన్ని పరిమితులు ఉంటాయని, ఇప్పుడు బీజేపీ మిషన్ కోసం పూర్తిగా అంకితమవడానికి అవకాశం లభించిందని చెప్పారు.