Telangana | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు సంస్థలకు కొత్త డైరెక్టర్ల నియామకం సీరియల్‌ను తలపిస్తున్నది. ఏడాది నుంచి కొలిక్కి రావడమే లేదు. ఎట్టకేలకు గత నెలలో డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను మాత్రం పూర్తిచేశారు. ఇక అంతా అయిపోయింది. అర్డర్లు రావడమే తరువాయి అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమయ్యిందో కాని నెల గడిచినా కొత్త డైరెక్టర్ల నియామకం జరగనేలేదు. ఆ అంశాన్ని పెండింగ్‌లో పెట్టేశారు. సాగదీతలు, సాచివేతలతో సర్కారు కాలం వెల్లదీస్తున్నది. రాష్ట్రంలో టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్కో, టీటీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ సంస్థల్లో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరిలో నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 91 మంది 152 దరఖాస్తులను సమర్పించారు. ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలకు కొందరు అనర్హులను పిలిచారన్న ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక భారీ ఎత్తున నగదు చేతులు మారిందన్న ప్రచారం జరిగింది.
తొలగింపులపై తాత్సారం
విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులందరినీ 2025 మార్చి 31లోగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాత వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారని అంతా అనుకున్నారు. కానీ, విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించనేలేదు. పైగా కొత్త డైరెక్టర్లను నియమించనూలేదు. ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావును ప్రభుత్వం తాజాగా ఈఆర్సీ సభ్యుడిగా నియమించింది. దీంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ట్రాన్స్‌కో ట్రాన్స్మిషన్ డైరెక్టర్ జగత్‌రెడ్డి ఇటీవలే రాజీనామా చేశారు. గతంలో ఓ ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకే అదనపు బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నారు. దీంతో విద్యుత్తు సంస్థల్లో పాలన గాడితప్పింది. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అనేక సమస్యలు నిత్యం ఎదురవుతున్నాయి.