హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘రైతునేస్తం’ 21వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఇచ్చే ‘రైతునేస్తం-2025’ పురస్కారాలకు రైతునేస్తం ఫౌండేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వారు ‘రైతునేస్తం’ వెబ్సైట్, http//rythunestham.in/awards నుంచి అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు పరిశోధనా వ్యాసా లు, సాగు అనుభవాలను జతపరిచి 15లోగా అందజేయాలని కోరారు. దరఖాస్తులను ఎడిటర్, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్-500004కి లేదా 9676797777 లేదా editor@ rythunestham. in లో అందజేయాలని సూచించారు.
కాళేశ్వరం గొప్పదనమేందో రైతును అడుగు! ; రేవంత్‌కు ఓ నెటిజన్ సవాల్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) ; హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదనే విషయం అర్థమవుతూనే ఉన్నదని తెలంగాణవాదులు, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. అసలు కాళేశ్వరమే పనికిరానిదైతే, ఆ జలాలతో తెలంగాణలోని 13 జిల్లా పరిధిలోని లక్షల ఎకరాల బీడు భూములు ఎలా సస్యశ్యామలమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. వానకాలం, యాసంగిలో రెండు పంటలు పండించే అవకాశం రైతులకు ఎలా దక్కిందని నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా ఎలా మారిందని అడుగుతున్నారు. ‘వరి, మక్క, పత్తి వంటి ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా ఎలా పెరిగింది? కాళేశ్వరంతో ఏ మేలు జరిగిందో ఒక్కో తెలంగాణ రైతును అడుగు రేవంత్.. వాళ్లే చెప్తారు?’ అంటూ రవి అనే నెటిజన్ సవాల్ చేశారు.