మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు సూచించారు. పేద, వెనుకబడిన తరగతుల వారికి ఉచితంగా విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ సమర్థవంతమైన ప్రణాళికను రచించారని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.
ఉచిత విద్యతో పాటు ఆరోగ్యకరమైన భోజనం, వసతి సదుపాయాలను బీసీ గురుకులాల్లో విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. 2022 – 23 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు మే 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తుదారులందరికీ జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తున్న జూనియర్ ఇంటర్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, అదే విధంగా మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశం కోసం ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఇంటర్, డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టారని, చదువు పూర్తి కాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా వృత్తి విద్యా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని మల్లయ్య బట్టు వివరించారు. బీసీ విద్యార్థులకు ఇంటర్ విద్యను అందించేందుకు 138 కాలేజీలు ఉన్నాయని వాటిలో 68 కాలేజీలు బాలురకు, 70 కాలేజీలు బాలికలకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని మల్లయ్య బట్టు తెలిపారు. బీసీ మహిళా డిగ్రీ కాలేజీలో చదువు పూర్తి చేసిన విద్యార్థులు కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలు సాధించారని ఆయన పేర్కొన్నారు.