Damodara Rajanarsimha | హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ): ‘ధర్నాలు చేసుకోండి, అద్దాలు పగలగొట్టండి’.. ఇదీ సమస్యలు చెప్పుకునేందుకు తన వద్దకు వచ్చిన స్టాఫ్‌నర్సులకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఉచిత సలహా. మంత్రి నుంచి ఊహించని సమాధానం రావడంతో సదరు స్టాఫ్‌నర్సులు హతాశులయ్యారు. కన్నీళ్లతో వెనుదిరిగారు. టిమ్స్ వైద్యశాలల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులు, ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు మంత్రి దామోదర రాజనర్సింహను శనివారం కలిశారు. అన్ని వైద్యశాలల్లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులకు పీఆర్సీని వర్తింపజేసినా, టిమ్స్‌లోని సిబ్బందికి వర్తింజేయలేదని, తమకు సైతం పీఆర్సీ అమలుచేయాలని కోరారు. తమ వయసు, సర్వీసును పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ స్టాఫ్‌నర్సుల రిక్రూట్మెంట్లో తమకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆ వినతులన్నింటినీ మంత్రి తోసిపుచ్చారు. దీంతో తమ సమస్యలను మరింత వివరంగా మంత్రి తెలియజేసేందుకు స్టాఫ్‌నర్సులు ప్రయత్నించారు. దీంతో మంత్రి వారిపై అసహనం వ్యక్తం చేశారు. ‘అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లండి.. అవసరమైతే ధర్నా చేసుకోండి.. అద్దాలు పగలగొట్టండి’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోపలికి రానిచ్చి మాట్లాడటమే తప్పయిందని, వెంటనే వెళ్లిపోవాలంటూ సీరియస్ అయ్యారు. దీంతో టిమ్స్ యూనియన్ స్టాఫ్‌నర్సులు నిర్ఘాంతపోయారు. మంత్రి చులకనగా మాట్లాడటంతో కన్నీటిపర్యంతమవుతూ అక్కడినుంచి వెనుదిరిగారు. తక్షణమే దామోద రాజనర్సింహను మంత్రి పదవి నుంచి తొలగించాలని టిమ్స్ యూనియన్ స్టాఫ్‌నర్స్ అండ్ కాంటాక్ట్ ఔట్ సోర్సింగ్ డిమాండ్ చేసింది.