హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీ కోసం డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్ ఎల్పీఆర్బీ సోమవారం వెల్లడించింది. 118 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11తో ముగియడంతో పరీక్ష తేదీని ప్రకటించారు.
పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉదయం 10గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహించనుండగా, అదేరోజు మధ్యా హ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు డిస్క్రిప్టివ్ విధానంలో 200 మార్కులకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించున్నారు. ఈ పరీక్షలను హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు పేర్కొన్నది. మొత్తం 118 పోస్టులకు 3,132 దరఖాస్తులు రాగా, వారిలో పురుషులు 1,908, మహిళలు 1,224 మంది ఉన్నారు.