హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ఏపీ టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి సోమవారం తెలంగాణ సీసీఎస్ పోలీసుల కండ్లుగప్పి పారిపోయాడు. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు తన ఇంటికి రావడాన్ని గమనించిన శివానందరెడ్డి.. బయటికి వెళ్లి, పోలీసులు రాకుండా గేటుకు తాళం వేసి పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా నందికొటూరు మండలం అల్లూరుకు చెందిన టీడీపీ ముఖ్యనేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానందరెడ్డిపై హైదరాబాద్లో పలు కేసులు నమోదయ్యాయి.
నగరంలోని ఓ భూ వివాదంలో క్రైమ్ నెంబర్ 194/2022లో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు అల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లి, అరెస్ట్ చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మొదట నోటీసు ఇవ్వాలని కోరి.. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ చూపాలన్నాడు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా తెలివిగా ఇంటి నుంచి బయటికి వచ్చి, గేటుకు తాళం వేసి, కారులో ఉడాయించాడు.
దీంతో అతడి భార్య, కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా బుద్వేలులో 26 ఎకరాలను అక్రమంగా విక్రయించాడంటూ సీసీఎస్ పెట్టిన కేసులో శివానందరెడ్డి భార్య, కుమారుడికి హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరిని అరెస్టు చేయొద్దని, ఒకవేళ అరెస్టు చేసుంటే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని సోమవారం ఆదేశించింది.