హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): అందాల పోటీల నిర్వహణ కోసం రోడ్డు పక్కన ఉండే చిన్న ఇండ్లు, దుకాణాలు కూల్చడం ఏమిటని? వాళ్ల కడుపులు కొట్టడం ఎందుకని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల కూల్చడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ధ్వజమెత్తారు.
అందాల భామలు వస్తారని వరంగల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో రోడ్డు పక్కనున్న పేద ల షాపులను కూల్చడం ఏంటని మండిపడ్డారు. ఓరుగల్లు చారిత్రిక నగరమని, ఎవరి మెప్పుకోసం ప్రజలను ఏడిపిస్తున్నారని ప్ర శ్నించారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రజల సుఖశాంతులతో రాష్ట్రానికి అందం వస్తుందని పేర్కొన్నారు.
రేవంత్ సర్కారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చడాలే ఎక్కువయ్యాయని రాకేశ్రెడ్డి ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ, లగచర్ల, హెచ్సీయూ, వరంగల్, నాగ ర్ కర్నూల్లో పేదలపై దాడి చేస్తున్నారని దు య్యబట్టారు. ఎస్-400లా ప్రజలకు కేటీఆర్ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధుకు డబ్బులు లేవంటూనే అందాల పోటీలకు రూ.200 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని, అబద్ధాలు చెప్పి ఆకాశంలో విహరిస్తే ప్రభుత్వానికి వచ్చేది అందం కాదని, చెడ్డపేరు అని దుయ్యబట్టారు. అందాల పోటీలతో వచ్చే లాభం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.
కేటీఆర్ తెచ్చిన ఈ-ఫార్ములా రేసు వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగిందని, రాష్ట్రానికి రూ.700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అద్భుతమైన ఫార్ములా రేసును కాంగ్రెస్ సర్కారు వచ్చీ రాగానే రద్దు చేయడం బాధాకరమన్నారు. హైదరాబాద్కు రెడ్ అలర్ట్ మెసేజ్లు వచ్చినా వాటిని లెక్క చేయకుండా అందాల పోటీలు నిర్వహించడం దారుణమన్నారు. రాష్ట్రంలో ధాన్యం నీళ్ల పాలవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కండ్లు తెరిచి రైతాంగంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం కూల్చివేతలు నిలిపివేసి, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.