హైదరాబాద్, మే 7(నమస్తే తెలంగాణ): పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్-2023 సదస్సుకి హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపారు. జూన్ 12 నుంచి 15 వరకు ‘కనెక్టింగ్ స్టార్టప్ ఎకోసిస్టం’ అనే అంశంపైన నిర్వహించే ఈ సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌ని కోరారు. జర్మనీ సెనేట్‌కు చెందిన ఎకనమిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ఈ ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా వివిధ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని కోరారు. జర్మనీ, ఆసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఏటా ఈ సదస్సును నిర్వహిస్తారు.
ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్టప్స్‌ను ఆసియా ఖండంలోని మారెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం జరగనున్న సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధాన అంశాలను విస్తృతంగా చర్చిస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఐడియాలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. జర్మనీలోని స్టార్టప్ ఎకో సిస్టం బలాన్ని ఆసియాలోని స్టార్టప్స్‌తో పంచుకొనేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆహ్వానంలో పేరొన్నారు.
కడెం డ్యామ్ పరిశీలన
హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): నిరుడు ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం కడెం డ్యామ్‌ను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆదిలాబాద్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఎస్ఈ సుశీల్దేశ్ పాండేతో కలిసి రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ కన్సల్టెంట్ శ్రీనివాసులు ప్రాజెక్టును సందర్శించారు. డ్యామ్ గ్యాలరీని, కట్టలను, గేట్ల పరిస్థితిని పరిశీలించారు. డ్యామ్ భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.