
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మిణ్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద మరో 500 మందిని ఎంపికచేశారు. ఇప్పటికే ఈ పథకం కింద 2,011 మందికి లబ్ధి చేకూరింది. 2017 నుంచి అమలవుతున్న ఈ స్కీమ్ ద్వారా ఈ ఏడాది జనవరి నాటికి రూ.56.45 కోట్లు గ్రాంటుగా అందించారు. గత ఏడాది వచ్చిన దరఖాస్తులే 1,200కుపైగా పెండింగ్‌లో ఉండటంతో ఈ ఏడాది కొత్త దరఖాస్తులు స్వీకరించలేదు. పెండింగ్ దరఖాస్తుల్లో 500 దరఖాస్తులను తాజాగా తనిఖీ చేశారు. త్వరలోనే వీరికి ఆర్థిక సహాయం అందిస్తారు. పెండింగ్‌లో ఉన్న మరో 700 దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీ పూర్తయ్యాక వచ్చే ఏడాది మే, జూన్ నాటికి కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తామని సంక్షేమ పరిషత్ ప్రత్యేక అధికారి చంద్రమోహన్ తెలిపారు. కాగా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు బెస్ట్‌ను అమలుచేస్తున్నారు. ఈ స్కీం ద్వారా సొంతంగా వ్యాపారాలు చేసుకొనేందుకు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు గ్రాంట్ అందిస్తారు.