హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి తుది ఎలక్ట్రోల్స్ జాబితాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. గత ఎన్నికలకు, తాజా తుదిజాబితాకు సంబంధించి మూడుచోట్లా 31,452 ఎలక్ట్రోల్స్ పెరిగినట్టు తెలిపారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల తుది ఓటర్ల ఎలక్ట్రోల్స్ జాబితాను ఆయన వెల్లడించారు. నవంబర్ 23 నుంచి ఈ నెల 9 వరకు తమ కార్యాలయానికి వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రకారం నియోకవర్గాల వారీగా తుది జాబితా కిందివిధంగా ఉన్నట్టు వివరించారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో పెరిగిన ఎలక్ట్రోల్స్ 26,782 మంది ఉండగా, ఇందులో పురుషులు 16,507, స్త్రీలు 10,273, ట్రాన్స్జెండర్లు ఇద్దరు ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పెరిగిన ఎలక్ట్రోల్స్ 2,319 ఉండగా, పురుషులు 1,258, స్త్రీలు 1,061, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పెరిగిన ఎలక్ట్రోల్స్ 2,351ఉండగా, పురుషులు 1,442, స్త్రీలు 909 ఉన్నట్టు సీఈవో వివరించారు.