హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్మెంట్ అంగన్వాడీలపై తీవ్ర వివక్షత చూపిస్తున్నది. దీంతో పదవీ విరమణ పొంది తొమ్మిది నెలలు అవుతున్నా.. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఏడువేలమంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ హామీలు ఘనం..అమలు శూన్యం..
కాంగ్రెస్ ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్లకు రూ.18 వేలు వేతనం ఇస్తామని ప్రకటించింది. టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. కానీ ఇప్పు డు అమలు చేయడం లేదు. 2024 జూలై 1నుంచి విరమణ పేరుతో ఏడువేల మందిని ఉద్యోగాలు చేయనీయడం లేదు. దీంతో అటు వేతనాలు అందక.. ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో సముచిత గౌరవం
1975లో ఐసీడీఎస్ ఏర్పడ్డప్పటి నుంచి స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. పదేండ్లలో మూడుసార్లు వేతనాలు పెంచింది. రూ.4,200 ఉన్న వేతనాన్ని మొద ట రూ.7000, ఆ తర్వాత రూ.10,500 పెంచిం ది. అలాగే రూ.2,000 ఉన్న ఆయాల వేతనాన్ని రూ. 4000, మరో విడుత రూ. 6000కు పెంచింది. ఆ తర్వాత ఉద్యోగుల మాదిరిగా 30% పీఆర్సీని వర్తింపజేయడంతో వారి వేతనం రూ.13,650కు, ఆయాలకు రూ.7,500కు పెరిగింది. అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించింది.
కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి
ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అంగన్వాడీ టీచర్లకు రూ.18,000 వేతనాలు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, 16 నెలలైనా అమలుకు నోచుకోవడంలేదు. దీంతో విరమణ పొందిన వారు ఆర్థికంగా అరిగోస పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.
– నల్లా భారతి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు