Banakacherla | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పోలవరం నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని, తద్వారా బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరుతాయనే ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బనకచర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్ కోసం ఉద్దేశించి జారీచేసిన టెండర్లను రద్దుచేసినట్టు తెలుస్తున్నది. మొదటి దశలో వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమలసాగర్ వరకే చేపట్టి, భవిష్యత్తులో బనకచర్ల వరకు విస్తరించుకోవాలనే ఉద్దేశంతో ఏపీ ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఆ దిశగానే ప్రణాళికలను సిద్ధంచేస్తున్నట్టు సమాచారం.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం ‘పోలవరం-బనకచర్ల’ లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వరద జలాల పేరిట 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు మళ్లించే ప్రతిపాదనలతో రూ.80,112 కోట్లతో లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. అయితే, ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ రిపోర్ట్‌ను (పీఎఫ్ఆర్) అధ్యయనం చేసిన కేంద్ర సంస్థలతోపాటు కో బేసిన్ రాష్ర్టాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ నేపథ్యంలో తొలుత సానుకూలంగా స్పందించిన కేంద్రం సైతం ప్రస్తుతం నిధుల సాయానికి ససేమిరా అన్నదని విశ్వసనీయ సమాచారం. మరోవైపు, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఏపీ రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని మోపుతుందని అక్కడి మేధావులు, ఆలోచనాపరులు, మరీ ముఖ్యంగా రాయలసీమ వాసులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం బనకచర్ల లింక్ ప్రాజెక్టును తాత్కాలికంగా విరమించుకున్నట్టు అర్థమవుతున్నది. అయితే, ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. మొదటి దశను జీసీ (గోదావరి-కావేరి) ప్రాజెక్టులో భాగంగా కేంద్ర నిధులతో పూర్తి చేసుకునేలా, రెండవ దశలో బనకచర్ల లింక్‌ను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఆ దిశగా ప్రణాళికలను రూపొందించడమే కాదు, ఎన్‌డబ్ల్యూడీఏకు ఇప్పటికే ప్రతిపాదనలను పంపినట్టు సమాచారం. కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టు ఇరిగేషన్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కృష్ణాలో వరద జలాల ఆధారంగా 1995లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును చేపట్టింది. కేవలం మూడు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టిన ఆ ప్రాజెక్టును ఆ తరువాత 2005లో 11,600 క్యూసెక్కులకు విస్తరించింది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి రెండు సొరంగాల ద్వారా జలాలను నల్లమల రిజర్వాయర్‌కు తరలించాలనేది ప్రణాళిక. ఇప్పటికే దీనిపై అభ్యంతరాలున్నాయి. ఇదిలాఉంటే, జీసీ రివర్ లింక్ ప్రాజెక్టులో మొత్తంగా 148 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించాలనేది ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదన.
ఇప్పటికీ ప్రాజెక్టును ఎక్కడినుంచి చేపట్టాలనేది ఖరారు కాలేదు. నీటి వాటాలు, సాంకేతిక అంశాల కారణంగా అది ముందుకు పడే పరిస్థితి కనబడటం లేదు. ఇదే అదునుగా తాజాగా ఏపీ ఆ జీసీ లింకును పోలవరం నుంచి చేపట్టాలని ప్రతిపాదిస్తున్నది. ప్రస్తుతం బనకచర్ల కూడా అసాధ్యమని తేలడంతో అవే ప్రతిపాదనలను ముందుకు తీసుకొస్తున్నది. పోలవరం నుంచి ప్రకాశం బరాజ్‌కు, అక్కడినుంచి జలాలను సాగర్ కుడికాలువకు, ఆపై మరో కాలువ ద్వారా పల్నాడు జిల్లాలో నిర్మించబోయే బొల్ల్లపల్లి రిజర్వాయర్‌కు, అక్కడినుంచి ఒక కాలువ ద్వారా నల్లమల రిజర్వాయర్‌కు, మరో కాలువ ద్వారా సోమశిల తద్వారా కావేరికి తరలించాలనేది ప్రణాళిక. మొత్తం గోదావరి నుంచి మళ్లించే జలాల్లో ఏపీకి 48 టీఎంసీలు, తమిళనాడుకు 100 టీఎంసీలు ఇవ్వాలని కూడా ప్రతిపాదన చేసినట్టు తెలుస్తున్నది. ఈ ప్రణాళిక మొత్తానికి రూ.58 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా.
జీసీ లింక్ ప్రాజెక్టులో భాగంగా చేపడితే కేంద్రమే ఆ నిధులను భరిస్తుందనేది ఏపీ ఆలోచన అని అధికారులు వివరిస్తున్నారు. భవిష్యత్తులో రెండవ దశలో నల్లమల రిజర్వాయర్ నుంచి బనకచర్లకు తరలించుకోవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏపీ ప్రతిపాదనలకు కేంద్రం సైతం సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తున్నది. కేంద్రం సంపూర్ణమైన భరోసా ఇవ్వడంతోనే బనకచర్ల లింక్‌కు బదులుగా కొత్త ప్రతిపాదనలను ముందుకు తెచ్చినట్టుగా ఇరిగేషన్ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. అంతేకుండా, జీసీ లింక్‌ను చేపట్టాలని కేంద్రంలోని మోదీ సర్కారు సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, రాష్ర్టాల అభ్యంతరాల నేపథ్యంలో అది ఆచరణ రూపం దాల్చడం లేదు. ప్రస్తుతం ఏపీ చేసిన ప్రతిపాదనలతో జీసీ లింక్‌కు మార్గం సుగమమవుతుందని కేంద్రం సైతం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.