భారత మహిళా మండలిలా ఆంధ్ర మహాసభలోనూ ఆంధ్ర మహిళా మండలి ఏర్పాటు చేశారు. నాలుగో ఆంధ్రమహాసభ 1935 డిసెంబరులో సిరిసిల్లలో జరిగింది. మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన మహాసభల్లోనే ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా సభకు అధ్యక్షత వహించారు. రెండు సభలకు దంపతులు అధ్యక్షత వహించడం సిరిసిల్ల ఆంధ్రమహాసభ ప్రత్యేకత. మహిళా ప్రతినిధి ఎల్లాప్రగడ సీతాకుమారి ‘ఆంధ్ర యువతి మండలి’ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తర్వాత బూర్గుల రామాకష్ణారావు సతీమణి అనంత లక్ష్మీదేవితో కలిసి కార్యాచరణకు దిగారు.
ఆంధ్రయువతి మండలికి గద్వాల మహారాణి ఆదిలక్ష్మీ దేవి అధ్యక్షులుగా, బూర్గుల అనంత లక్ష్మీదేవి ఉపాధ్యక్షురాలిగా, సీతాకుమారి కార్యదర్శిగా మరికొందరు సభ్యులతో అదే సంవత్సరంలో ‘ఆంధ్ర యువతి మండలి’ ఆవిర్భవించింది. హైదరాబాద్లోని మహిళా ప్రముఖులు ఇల్లిందల సరస్వతీ దేవి కోశాధికారిగా, కూచిబొట్ల రాజ్యలక్ష్మి సంయుక్త కార్యదర్శిగా చేరారు. మరికొందరు మహిళలు కూడా ఈ సంస్థలో సభ్యులుగా చేరారు.
శ్రీకష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలోని పుస్తకాలను ఒక ఉద్యోగి ద్వారా ఆసక్తి ఉన్న మహిళా పాఠకులకు చేరవేసేవారు. భాషోద్ధరణతోపాటు కళలను ప్రోత్సాహించడం ప్రారంభించారు. ‘ఆంధ్ర యువతి మండలి’ స్వాతంత్య్రానంతరం కూడా మహిళాభ్యున్నతి కోసం పాటుపడుతోంది. నారాయణగూడలో 1952లో మండలి భవనం నిర్మించారు. మొదట ప్రాథమిక పాఠశాల స్థాపించి, తర్వాత హైస్కూల్ స్థాపించారు. మహిళలకు జీవన నైపుణ్యాలను పెంపొందిస్తూనే యువతుల కోసం కళాశాలలు ప్రారంభించింది.