జ్యోతిషశాస్త్రవేత్తలు, పండితుల విశ్లేషణ
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): భారతావని వికాసం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ ప్రకటించిన సమయం (మధ్యాహ్నం 1-19 గంటలు) సకలయోగ సంహితంగా ఉందంటున్నారు జ్యోతిషశాస్త్రవేత్తలు. దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేయాలని ఆయన మొదలుపెట్టిన ప్రయాణం సవాళ్లను అధిగమించి ఇతర రాజకీయ పక్షాలకు సవాల్‌గా నిలుస్తుందని విశ్లేషిస్తున్నారు. నవ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
లక్ష్యం దిశగా..
రాజకీయాలకు ప్రధాన అనుకూల గ్రహాలు రవి, కుజుడు, గురువు. కీర్తిప్రదాత అయిన గురువు ఈ లగ్నానికి ప్రధాన యోగకారకుడు అయ్యాడు. పైగా షష్ట్యాంశలో బృహస్పతి ఉచ్ఛంగతుడై ఉండటం విశేషం. ఇక ఆరోస్థానంలో కుజుడు స్వనక్షత్రంపై, సబ్లార్డ్ గురువుగా కలిగి ఉండటం… బృహస్పతి ప్రాధాన్యాన్ని మరింత బలపరుస్తున్నది. ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఒక మహోన్నత లక్ష్యంతో అడుగు వేయడంలో చతుర్థాంశ, భాగ్యాంశ, రాజ్యాంశలు ప్రధాన భూమిక పోషిస్తాయి. చతుర్థాంశాధిపతి బుధుడు ఉచ్ఛంగతుడు కావడం, గురు దృష్టిని కలిగి ఉండటం ముహూర్తం బలమైనదిగా స్పష్టం చేస్తున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికల వేళకు ఈ ముహూర్తం ప్రకారం కేసీఆర్ జాతీయ పార్టీకి చంద్ర దశలో శుక్రాంతర్దశ ఉండబోతున్నది. ఇది పార్టీకి పూర్తి అనుకూల సమయంగా చెప్పవచ్చు. అన్నిటికీ మించి.. విజయదశమి నాడు మొదలుపెట్టిన ఏ కార్యమైనా జయప్రదం అవుతుంది అనడంలో సందేహం లేదు. అమ్మవారిపై మెండుగా విశ్వాసం ఉన్న కేసీఆర్ వెన్నంటి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అపరాజితాదేవి ఆశీస్సులతో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ఆగమనం.. భారతావని గతిని మార్చాలని, ఆ మార్పునకు ఇది సరైన ముహూర్తమని విశ్లేషించవచ్చు. – కణ్వస
ఉద్యమ స్ఫూర్తితో..
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకరీత్యా రానున్న రోజులు విశేషంగా ఉన్నాయి. ఆయన్ను పోరాట యోధుడిగా నడిపిన రాహుదశ ముగింపులో మరో ఉద్యమానికి ఊపిరులూదింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ముఖ్యమంత్రికి గురుదశ మొదలుకానుంది. ఇది వ్యక్తిగతంగా ఆయనకు, పార్టీకి విశేష ఆదరణ తీసుకువస్తుంది. దేశ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రవి ఉన్న నక్షత్రం ఆధారంగా దశలు లెక్కిస్తే 2008 నుంచి ముఖ్యమంత్రికి బుధ దశ ఉన్నది. ఈ దశలోనే తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకోవడం, ప్రత్యేక రాష్ట్ర సాధన, బంగారు తెలంగాణ నిర్మాణం ఇలా.. కేసీఆర్ నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ సిద్ధించాయి. 2025 ఫిబ్రవరి వరకు ఉన్న బుధ దశ పూర్తయ్యేలోపు ముఖ్యమంత్రి నూతన సంకల్పం నెరవేరే అవకాశాలున్నాయి.
విజయ యోగం
పార్టీ ప్రకటించిన ధనుర్లగ్నానికి గ్రహసంపత్తి ఘనంగా ఉన్నది. లగ్నాధిపతి గురువు స్వక్షేత్రంలో ఉండటం, లగ్నభావ నక్షత్రాధిపతి రవి భావరీత్యా భాగ్యంలో ఉండటం బలమైన యోగాలుగా చెప్పవచ్చు. ధనుర్లగ్నానికి ఆరింట కుజుడు స్వనక్షత్రంపై ఉండటం ‘విజయ యోగం’గా పరిగణిస్తారు. లగ్నాధిపతి గురువుకు, లాభాధిపతి కుజుడికి సంబంధం ఏర్పడటం, లగ్నభావ నక్షత్రాధిపతి రవికి, కుజుడికి కూడా సంబంధం ఉండటం ‘విజయ యోగాన్ని’ మరింత పరిపుష్టం చేస్తున్నది. ‘విజయ యోగం’ ప్రభావంతో ఈ సమయంలో ప్రకటించిన పార్టీ విజయపథంలో నడుస్తుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తుంది.
గెలుపు బాటలో..
పార్టీ ప్రకటించిన సమయానికి లగ్న, చతుర్థాధిపతి గురువు స్వక్షేత్రంలో ఉండటం విశేషం. ఇది రాజకీయ, సామాజిక అభివృద్ధిని సూచిస్తుంది. అంతేకాదు గురువు దశమ కేంద్రాన్ని చూడటం, పంచమ కోణ దృష్టితో కర్కాటకాన్ని (కేసీఆర్ జన్మరాశిని) చూస్తుండటం శుభ పరిణామం. రాజకీయంగా జాతీయస్థాయిలో పార్టీ గెలుపుబాటలో పయనిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి పార్టీ విధానంగా దేశ, రాష్ట్ర ప్రజానీకానికి అనుకూల నిర్ణయాలు వెలువడుతాయి. జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టే ముహూర్తంగా దీనిని విశ్లేషించవచ్చు. – గుడి ఉమామహేశ్వర సిద్ధాంతి, నిర్మల్
భద్రాద్రి రాముడి ఆశీస్సులు
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలి. ఇందుకు భద్రాద్రి సీతారామచంద్రస్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఆయనకు దేశాన్ని ఏలే నేర్పు ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని మంచి మార్పుగా భావించాలి.
-అమరవాది విజయరాఘవన్,
భద్రాద్రి రామాలయం ప్రధానార్చకుడు
దేశ రాజకీయాల్లో రారాజు
జాతీయ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్న కేసీఆర్‌కు శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఉత్తమ నాయకుడికి అన్ని రాష్ర్టాల ప్రజల మద్దతు ఇచ్చి దేశాన్ని నడిపించగలిగే సర్వోన్నత పదవికి పట్టం కట్టాలి.
-పూర్ణానంద ఆరాధ్యులు,శ్రీశైల దేవస్థాన స్థానాచార్యులు
కేసీఆర్‌కు రాజన్న అనుగ్రహం
సీఎం కేసీఆర్ దేశ ప్రజల శ్రేయస్సు కోసం జాతీయ రాజకీయాల్లో విజయబావుటా ఎగురవేయాలని కోరుకుంటున్నా. ఆయన ఆలయాల అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది.
– అప్పాల భీమాశంకర్, వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యుడు
మనోసంకల్పం నెరవేరాలి
రాష్ట్రంలో ఆలయాలు, అర్చకుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. ఆయన మనోసంకల్పం నెరవేరాలని జోగుళాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాం. దేశంలోని ఆలయాల స్థితిగతులను బాగు చేయాలని కోరుకుంటున్నాం.
-డిండిగల్ ఆనంద్ శర్మ,
అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలంపూర్
కోనాయిపల్లి సెంటిమెంట్
స్వామి వారి అనుగ్రహంతో విజయం
సీఎం కేసీఆర్‌కు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో విజయం కలుగుతుంది. 1985 నుంచి స్వామికి మొక్కి ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నారు. అప్పటి నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నరు. నాటి నుంచి నేటి వరకు మేము నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు చేస్తున్నాం. స్వామి సన్నిధిలో ఏ సంకల్పం తీసుకున్నా విజయం సిద్ధిస్తుంది. స్వామి వారి కృపాకటాక్షంతో రెండుసార్లు కేసీఆర్ సీఎం అయ్యారు. ఇక్కడ ఏది కోరుకున్నా అది కచ్చితంగా జరుగుతుంది. దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ అప్రతిహత విజయాలు సాధించాలని స్వామివారిని వేడుకుంటున్నాం.
-కలకుంట వెంకట నర్సింహాచార్యులు, అర్చకులు
చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు
సీఎం కేసీఆర్ చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు కలవాడు. నేను, కేసీఆర్ 6 నుంచి 11వ తరగతి వరకు దుబ్బాకలో చదువుకున్నాం. కేసీఆర్ మొదటి నుంచి చురుకైన విద్యార్థి. ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాడు. దేశ రాజకీయాల్లోనూ రాణిస్తాడన్న నమ్మకం ఉన్నది.
– రామగౌడ్, కేసీఆర్ బాల్య మిత్రుడు, చింతమడక
కేసీఆర్‌ను మించిన నేత లేడు
విద్యార్థి దశ నుంచే కేసీఆర్ లోతైన ఆలోచన గల విద్యార్థి. ఆయన దేశ ప్రధాని అయితే బాగుంటుందని నేను ఎనిమిదేండ్ల కిందనే చెప్పిన. ప్రతి విషయంలోనూ ప్రణాళికాబద్ధ్దంగా ముందుకు వెళ్లే నాయకుడు. ఆయన నాయకత్వంలో జాతీయ పార్టీ రావడం సంతోషకరం. భగవంతుని అనుగ్రహం ఆయనకు మెండుగా ఉన్నది. గురువుగా నా ఆశీస్సులు ఉంటాయి. ఆయన జాతీయ రాజకీయాల్లో రాణించాలని కోరుకొంటున్నా.
-వేలేటి మృత్యుంజయ శర్మ, సీఎం కేసీఆర్ గురువు
చాలా సంతోషంగా ఉన్నది
సీఎం కేసీఆర్ చింతమడక నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ దేశస్థాయికి వెళ్లడం సంతోషంగా ఉన్నది. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నరు. ఇవాళ దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది. సీఎంగా సక్సెస్ అయిన కేసీఆర్.. ప్రధాన మంత్రి అయి విజయవంతం అవుతారు. దేశంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం, సంక్షేమ పథకాలు అందాలంటే అది కేసీఆర్‌లాంటి విజన్ ఉన్న నాయకుడికే సాధ్యం. కేసీఆర్ పీఎం అయితేనే అది సాధ్యం.
– హంసకేతన్‌రెడ్డి, చింతమడక సర్పంచ్