హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ ఘన్సీమియాగూడలో రెండు రోజులుగా గుర్తుతెలియని జంతువు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌వో విజయానంద్ తెలిపారు. ఆ జంతువు హైనా నా, చిరుతనా అనేది గుర్తించలేకపోతున్నామన్నారు. 10 ట్రాప్ కెమెరాలు, 3 బోన్లు ఏర్పాటు చేశామని, ఎక్కడా జంతువు ఆనవాళ్లు దొరకలేదని స్పష్టం చేశారు. అడవి నుంచి బయటకు వచ్చిన జంతువులు.. త్వరగా ట్రాప్‌లో పడవని, ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని సూచించారు. కాగా .. నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. అదే చిరుత రన్‌వేపైకి వచ్చి ఉంటుందని తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించిందని, వారం రోజులు శ్రమించి దాన్ని పట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
41వేల ఏండ్ల కిందటి పక్షిగూడు గుర్తింపు
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం జర్మనీ, ఆస్ట్రేలియా, యూఎస్‌కు చెందిన సైంటిస్ట్‌లతో కలిసి పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో 41 వేల సంవత్సరాల క్రితం నాటి నిప్పుకోడి గూడు కనిపెట్టారు. 40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు ఎందుకు అంతరించిపోయాయని చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ పక్షి గూడుని వారు కనుగొన్నారు. ఈ గూడులో 9 నుంచి 11 గుడ్లు ఉండేవని పేర్కొన్నారు. వీటి గుడ్లు ఒక్కోటి 10 అడుగుల వెడల్పు ఉంటుంది. గతంలో దక్షిణ భారతదేశంలో 3,500 నిప్పుకోడి గుడ్ల పెంకులు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌కు 2,35,907 మంది హాజరుకాగా, 1,37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. 58.4 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే మళ్లీ టెట్‌ను నిర్వహిస్తామని వివరించారు. టెట్ ఫలితాల తరువాత మెగా డీఎస్సీ ప్రకటిస్తామని పేర్కొన్నారు.