e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home Top Slides బాధితులమే.. బాధ్యులం కాదు!

బాధితులమే.. బాధ్యులం కాదు!

బాధితులమే.. బాధ్యులం కాదు!
  • తెలియకుండానే ప్రాణాలు తీస్తున్న మహమ్మారి
  • ఆప్తుల మరణానికి పరోక్షంగా కారణమనే బాధ
  • అపరాధ భావనకు గురికావద్దంటున్న నిపుణులు

సిద్దిపేట జిల్లాకు చెందిన నిర్మలమ్మ జ్వరం వచ్చి వారం పాటు మంచాన పడింది. కొడుకు జగదీశ్వర్‌ దగ్గరుండి తల్లికి సేవలు చేశాడు. యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. ఒకరోజు విపరీతమైన ఆయాసం రావడంతో సీటీస్కానింగ్‌ చేయగా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని తేలింది. అదే రోజు సాయంత్రం నిర్మలమ్మ ప్రాణాలు విడిచింది. ‘వారంనుంచి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తే బతుకుతుండె’ అని ఇరుగుపొరుగువాళ్లు సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తున్నారు. దీంతో జగదీశ్వర్‌ ఇంటి నుంచి బయటికి రావడం మానేశాడు. తల్లిని తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు.

కరీంనగర్‌కు చెందిన నారాయణ భార్యకు జ్వరం వచ్చింది. తెలిసిన డాక్టర్‌ ఇచ్చిన సలహా మేరకు ఇంట్లోనే ఉంచి చికిత్స మొదలుపెట్టాడు. నాలుగురోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో దవాఖానకు తీసుకెళ్తుండగా ఆమె కన్నుమూసింది. భార్య చావుకు తానే కారణమని నారాయణ మానసికంగా కుంగిపోతున్నాడు.

హైదరాబాద్‌, మే 28 (నమస్తే తెలంగాణ): సెకండ్‌ వేవ్‌లో కరోనా ఒక సాధారణ జ్వరంగా మొదలవుతున్నది. యాంటిజెన్‌ పరీక్షల్లోనూ చాలా సందర్భాల్లో నెగెటివ్‌ వస్తున్నది. ఇతర లక్షణాలు కనిపించి, కొవిడ్‌గా నిర్ధారించేలోపు మూడు, నాలుగు రోజులు వృథా అవుతున్నది. ఆలోగా వైరస్‌ నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగిస్తున్నది. చికిత్స అందించే సమయం కూడా ఇవ్వకుండా కొందరి ప్రాణాలను బలితీసుకుంటున్నది. దీంతో ‘ఒక్క రోజు ముందు దవాఖానకు తీసుకెళ్తే బాగుండు.. నా నిర్లక్ష్యం వల్లే మరణించారు’ అన్న భావన కుటుంబ సభ్యుల్లో పెరిగిపోతున్నది. బలం, బలగం ఉండి కూడా కాపాడుకోలేకపోయామన్న ఆలోచన వారిని మానసికంగా కుంగదీస్తున్నది. కొవిడ్‌తో మరణించిన తల్లిదండ్రులు, సమీప బంధువులు, ఆప్తులు, స్నేహితుల అంత్యక్రియలకు హాజరుకాలేనివారు కూడా చివరిచూపునకు నోచుకోలేకపోయామంటూ మనోవేదనకు గురవుతున్నారు.

తప్పు మనది కాదు

కరోనాను లక్షల మంది జయించారు. తెలంగాణలోనే ఐదు లక్షల మందికిపైగా సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో అత్యధిక శాతం మంది ఇంట్లో ఉండి కోలుకొన్నవారే. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 79.9% కేసులు అసిమ్టమాటిక్‌. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి మాత్రమే పరిస్థితి విషమిస్తున్నది. అంతేకాకుండా కొత్త వేరియంట్లు నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుండటంతో ప్రాణాల మీదికి వస్తున్నది. కాబట్టి ఈ విషయంలో ఎవరిదీ తప్పుకాదని మానసిక నిపుణులు చెప్తున్నారు. ‘ఒక్క రోజు ముందు వెళ్తే బాగుండు’ అన్న భావనే సరైంది కాదని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొంటే కుంగుబాటు నుంచి బయటపడవచ్చని చెప్తున్నారు. ఆప్తుల అంతిమయాత్ర కన్నా కుటుంబసభ్యుల ప్రాణాలే ముఖ్యమని, కాబట్టి మనసు దిటవు చేసుకోవాలని కోరుతున్నారు.

ఇతరుల మాటలు పట్టించుకోవద్దు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన మల్లేశం తండ్రికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎంతో శ్రమపడి గాంధీ దవాఖానలో చేర్పించాడు. డాక్టర్లు ఆయనను ఆక్సిజన్‌ బెడ్‌పై ఉంచి మెరుగైన వైద్యం అందించారు. అయితే రెండు రోజుల తర్వాత దవాఖానలో టిఫిన్‌ సరిగా పెట్టడం లేదంటూ ఆ వృద్ధుడు పోరుపెట్టాడు. డాక్టర్లు చెప్పినా వినకుండా మల్లేశం ఆయనను డిశ్చార్జి చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. ప్రైవేట్‌లో ఎక్కడా బెడ్‌ దొరుకలేదు. పరిస్థితి విషమించి తండ్రి చనిపోయాడు. ఒక చిన్న కారణంతో చికిత్స మధ్యలో నుంచి డిశ్చార్జి చేయటం వల్లే తన తండ్రి చనిపోయాడని మల్లేశం బాధపడుతున్నారు. ఒక డాక్టర్‌పై లేదా దవాఖానపై నమ్మకం ఉంచి చేరినప్పుడు చికిత్స కొనసాగించాలని, ఎవరో ఇచ్చిన సలహాలను పట్టించుకొని దవాఖానల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవద్దని వైద్యనిపుణులు కోరుతున్నారు. చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు.

పరిస్థితి అలాంటిది

ఏడుగురం అన్నదమ్ములం ఉండి కూడా తండ్రిని కాపాడుకోలేకపోయామంటూ ఇటీవలే ఓ కుటుంబం మొత్తం డిప్రెషన్‌లోకి వెళ్లింది. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మామూలుగా మార్చడానికి శ్రమించాల్సి వచ్చింది.ఈ మధ్య ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితులను మనం పూర్తిగా అవగాహన చేసుకొంటేనే మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతాం. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ఎవరి పరిస్థితి వారికి తెలుసు.
-డాక్టర్‌ కవిత, మానసిక వైద్యురాలు

ఎవరినీ నిందించొద్దు!

ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నిందించటంలో ప్రయోజనం లేదు. అందరూ జాగ్రత్తగా ఉంటూ.. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా దృష్టి పెట్టాలి. ఇంతటి విపత్కర పరిస్థితులు ఎప్పుడో ఒకసారి వస్తాయి. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలపైనో, వ్యక్తులపైనో నిందలు వేయకుండా ప్రజలు ఎవరికి వారు భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌ వాడటం వంటివి తరచూ పాటించాలి. ప్రాణాలు కాపాడుకొనేందుకు ఇల్లు దాటకుండా ఉండాలి. వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేస్తే ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్ర వల్ల శరీరంలోని రక్షణ వ్యవస్థను కాపాడుకోవచ్చు.
-డాక్టర్‌ వర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాధితులమే.. బాధ్యులం కాదు!

ట్రెండింగ్‌

Advertisement