Rajanna Siricilla | ఎల్లారెడ్డిపేట, జూలై 23: యూట్యూబ్ సరదాకు 11 ఏండ్ల బాలుడు బలయ్యాడు. అందులోని దృశ్యాలను అనుకరించేందుకు యత్నించి ఉరి బిగుసుకొని మృత్యువాతపడ్డాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనాయక్ తండాలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది.
కిష్టూనాయక్ తండాకు చెందిన మాలోతు ప్రశాంత్, రేఖ దంపతులకు ఇద్దరు కుమారులు ఉదయ్ (11), చరణ్‌జిత్. పెద్దకొడుకు ఉదయ్ రాజన్నపేట స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. సెల్‌ఫోన్‌కు బానిసయ్యాడు. తరచూ యూట్యూబ్‌లో నేర సంబంధ సన్నివేశాలు చూసేవాడు. పలుమార్లు తల్లిదండ్రులు మందలించినా మార్పురాలేదు. శనివారం రాత్రి భోజనం తర్వాత బాలుడు తాత హరిసింగ్ ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు.
యూట్యూబ్‌లో ఆత్మహత్య దృశ్యాన్ని అనుకరిస్తూ గోడకున్న మొలకు లుంగీతో కట్టి మెడకు చుట్టుకున్నాడు. ఈ క్రమంలో ఉరి బిగుసుకుని ప్రాణాలు వదిలాడు. తల్లిదండ్రులు ఉదయ్ కోసం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. తాత హరిసింగ్ ఇంటికి వెళ్లగా గడియపెట్టి ఉన్నది. ఎంత పిలిచినా పలుకకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికెళ్లి చూడగా ఉదయ్ మొలకు వేలాడుతూ కనిపించాడు. హుటాహుటినా ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల దవాఖానకు తరలించారు. చేతికొచ్చిన కొడుకు అండగా నిలుస్తాడనుకుంటే.. తీరని శోకాన్ని మిగిల్చాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.