హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ) : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)ను ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుగా గుర్తించడం లేదని ఆంధ్రప్రదేశ్ తరఫు సాక్షి అనిల్‌కుమార్ గోయెల్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణాజలాలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయడంతోపాటు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో రెండోరోజైన శుక్రవారం సైతం కొనసాగింది. ఏపీ తరఫున ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ప్రతిపాదించిన చీఫ్ ఇంజినీర్ అనిల్‌కుమార్ గోయెల్‌ను తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఏఎమ్మార్పీ, నెట్టెంపాడు ప్రాజెక్టుపై, అదేవిధంగా గోదావరి జలాల మళ్లింపు ద్వారా వచ్చే 80 టీఎంసీలపై ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఏఎమ్మార్పీని గుర్తించడం లేదని ఏకే గోయెల్ తెలిపారు. అయితే 2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ప్రారంభం కావడంతోపాటు నాటినుంచే హైదరాబాద్‌కు తాగునీరు, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్నదని, గుర్తించకపోవడం ఏమిటని తెలంగాణ ప్రశ్నించింది.
అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లో ఆ ప్రాజెక్టు లేదని, ఈ నేపథ్యంలోనే ఏఎమ్మార్పీని గుర్తించడం లేదని గోయెల్ వివరించారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు మళ్లిస్తే.. నాగార్జునసాగర్ నుంచి కేడీఎస్‌కు సాగునీటి వినియోగాలు తగ్గిపోతాయని, ఆ జలాలను కృష్ణాలోని ఇతర ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చని తెలిపారు. గోదావరి జలాల మళ్లింపు అంశంపై తనకు పూర్తిగా అవగాహన లేదని, ఆ అంశాన్ని ట్రిబ్యునల్ చూడాల్సి ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనలో నెట్టెంపాడు ప్రాజెక్టును ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని వైద్యనాథన్ ప్రశ్నించగా.. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లకు సంబంధించిన ప్రాజెక్టులను మాత్రమే ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు పరిగణనలోకి తీసుకున్నట్టు ఏకే గోయెల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏపీ తరఫు సాక్షి ఏకే గోయెల్ క్రాస్ ఎగ్జామినేషన్ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ఇప్పటికే ఇరు రాష్ర్టాలు దాఖలు చేసిన ఎస్‌వోసీలపై కొనసాగుతుందని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ వెల్లడించారు. విచారణను జనవరి 16, 17వ తేదీలకు వాయిదా వేశారు.