కొమురవెల్లి, మార్చి 15 : కాంగ్రెస్ పాలనలో లంచం ఇస్తే తప్ప పనులు కావడం లేదని కలెక్టర్ ఎదుటనే అమ్మ కమిటీ చైర్పర్సన్ వాపోయింది. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి కొమురవెల్లి మండలం గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ఏర్పాటు చేసిన ఏఐ(ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) కంప్యూటర్ ల్యాబ్‌ను శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల కోసం లంచం అడుగుతున్నారని అమ్మకమిటీ చైర్పర్సన్ అన్నబోయిన బాలమణి, ప్రాథమిక పాఠశాల అమ్మకమిటీ చైర్పర్సన్ పుట్ట స్వప్న కలెక్టర్ ఎదుటనే వాపోయారు. బిల్లుల మంజూరు కోసం రూ. 8వేల వరకు అధికారులకు లంచం ఇచ్చినట్టు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ ఆదేశాలతో అమ్మకమిటీ సభ్యులకు రావాల్సిన బిల్లులను సాయంత్రం వరకు అధికారులు క్లియర్ చేశారు.