కేతేపల్లి/హయత్‌నగర్, డిసెంబర్ 7 : 108 అంబులెన్స్‌ను చోరీ చేసి ఎన్‌హెచ్-65పై పారిపోతున్న వ్యక్తిని పోలీసులు సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. శనివారం హయత్‌నగర్ నుంచి సూర్యాపేట జిల్లా టేకుమట్ల వరకు జరిగిన ఈ ఛేజింగ్ సినిమాను తలపించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన రావుల వెంకటరామనర్సయ్య హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. చిన్ని చిన్న దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు చిక్కాడు. శనివారం హయత్‌నగర్ సమీపంలోని సన్‌రైజ్ దవాఖాన వద్ద ఆగి ఉన్న 108 అంబులెన్స్‌ను చోరీ చేసి జాతీయ రహదారి-65పై సైరన్ మోగిస్తూ దూసుకెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన అంబులెన్స్ సిబ్బంది హయత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
వారు హైవేపై ఉన్న పోలీస్స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అప్పటికే నిందితుడు అంబులెన్స్‌తో చౌటుప్పల్ దాటి చిట్యాలకు చేరుకున్నాడు. చిట్యాల వద్ద ఏఎస్ఐ జాన్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఆపకపోవడంతో పోలీస్ వాహనంలో అంబులెన్స్‌ను వెంబడించారు. కట్టంగూర్ మండలం పామనుగుండ్లలో ఆపేందుకు ప్రయత్నించగా నిందితుడు ఏఎస్ఐని ఢీకొట్టి వెళ్లిపోయాడు. దాంతో ఏఎస్ఐ కాలు, ముఖానికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరింత అప్రమత్తమైన పోలీసులు కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే దారిలో బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఐనప్పటికీ నిందితుడు లెక్కచేయకుండా అంబులెన్స్‌తో బారికేడ్లను, టోల్‌ప్లాజా గేట్‌ను ఢీకొట్టి సూర్యాపేట వైపు వెళ్లాడు. కేతేపల్లి ఎస్ఐ శివతేజ సూర్యాపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు సిబ్బందితో కలిసి టేకుమట్ల బ్రిడ్జి వద్ద లారీలను అడ్డుపెట్టి విజయవాడ వైపు వెళ్లే దారిని మూసివేశారు. దాంతో దారిలేకపోవడంతో అంబులెన్స్‌ను రోడ్డు కిందికి దింపాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని, అంబులెన్స్‌ను హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.