హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ): రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నాడట వెనుకటికి ఎవరో?. కానీ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రజల సొమ్ము అమాత్యుల పాలవుతున్నది. మంత్రుల విలాసాల కోసం ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ఎవరేమనుకుంటే మాకేంటి? అన్న చందంగా ఇష్టారీతిన ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ ఇది. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని మినిస్టర్స్ క్వార్టర్ నంబర్ 30లో బీరువాతోపాటు ఇతర కొన్ని సివిల్ పనుల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.30 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఈ నెల 5న జారీచేసిన ఉత్తర్వులు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ మంత్రి క్వార్టర్లో ఏర్పాటుచేస్తున్న ఈ బీరువా ఎటువంటి మెటీరియల్‌తో చేశారో? అని కొందరు అడుగుతుంటే, దానికి బంగారు తాపడం చేయించారేమో! అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఖర్చవుతున్నది ప్రజాధనం. అది ఖర్చు చేస్తున్నది ప్రభుత్వానికి చెందిన మంత్రి క్వార్టర్లో. ఓ వైపు పేదల ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నది. ఆ రూ.5 లక్షలతో సుమారు 60 గజాల్లో ఒక హాలు, బెడ్రూమ్, వంటగది, టాయిలెట్ తదితర వాటిని నిర్మించవచ్చని లెక్కగట్టిన సర్కార్.. ఒక మంత్రి క్వార్టర్లో బీరువాకు ఏకంగా రూ.30లక్షలు ఖర్చుచేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.