దీక్షాదివస్‌కు అలుగునూరు ముస్తాబు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ బహిరంగ సభకు కరీంనగర్ జిల్లా అలుగునూరు ముస్తాబవుతున్నది.
- మూడు రోజులే గడువు.. భారీ ఏర్పాట్లు
- 10 ఎకరాల్లో సభా ప్రాంగణం.. 30 ఎకరాల్లో పార్కింగ్
- నాటి ఉద్యమ చరిత్రను గుర్తుచేస్తూ ప్రజలకు ఆహ్వానాలు
- సభాస్థలి వద్ద దీక్షా దివస్ ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు
కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ బహిరంగ సభకు కరీంనగర్ జిల్లా అలుగునూరు ముస్తాబవుతున్నది. 29న నిర్వహించనున్న సభకు మరో మూడు రోజులే గడువు ఉండటంతో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు సభా ప్రాంగణంలో పనులు వేగంగా సాగుతుండగా.. మరోవైపు నియోజకవర్గాల వారీగా ప్రజలను ఆహ్వానించే కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానిస్తుండటం ప్రచారంలో ప్రత్యేకతను చాటుకున్నది.
10 ఎకరాల్లో ప్రాంగణం..
అలుగునూరులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికకు సుమారు వంద మీటర్ల దూరంలోనే దాదాపు 30 ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సభా ప్రాంగణంలో నాటి దీక్షకు సంబంధించిన ఛాయాచిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యమంలో నవంబర్ 29న చోటుచేసుకున్న పరిణామాలు, అలుగునూరులో జరిగిన అరెస్టు ఘట్టాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించేలా ఈ ప్రదర్శనను నిర్వహించనున్నారు.
ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి..

సభకు ప్రజలను ఆహ్వానించేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జీలు, మహిళా నాయకులు బృందాలుగా ఏర్పడి గ్రామాలు, పట్టణాల్లోని ఇండ్లకు వెళ్తున్నారు. మహిళలకు బొట్టు పెట్టి దీక్షా దివస్ సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు గ్రామాల వారీగా నాయకులు పర్యటిస్తూ ప్రజలను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ప్రాధాన్యతను వివరిస్తూ కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు దీక్షా దివస్ పోస్టర్లతో నిండిపోతున్నాయి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
నాటి దీక్షా ఘట్టాన్ని గుర్తుచేస్తూ..
2009 నవంబర్ 29న ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు బయలుదేరిన సమయంలో అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచింది. అరెస్టు అనంతరం ఖమ్మం జైలులో ఆయన నిరాహార దీక్షను కొనసాగించారు. ఆ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడానికి దారితీసిన పరిణామాల్లో ఈ దీక్ష కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలోనే ఏటా నవంబర్ 29న దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సారి అలుగునూరులోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో నాటి ఉద్యమ జ్ఞాపకాలను మరోసారి ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సన్నద్ధం
దీక్షా దివస్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చేలా నాయకులు గ్రామాలవారీగా ప్రచారం చేస్తున్నారు. నాటి ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, ఉద్యమకారులు అప్పటి పరిస్థితులను వివరిస్తూ యువతకు ఉద్యమ చరిత్రను తెలియజేస్తున్నారు. ప్రజల నుంచి స్పందన వస్తున్నదని, సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

