హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు, అరెస్టు వెనుక పాలక పెద్దల వ్యూహం ఉన్నదా? శుక్రవారం లేటుగా అరెస్టు చేయడం, బెయిల్ వచ్చినా జైలులో ఉండేలా వారు పన్నిన పన్నాగమా? అంటే ‘అవును’ అనే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. శుక్రవారం మధ్యాహ్నం నుంచే బన్నీ అరెస్టుకు పోలీసులు సన్నాహాలు చేశారు. చకచకా అరెస్టు, గాంధీలో వైద్య పరీక్షలు, నాంపల్లి కోర్టులో బైండోవర్ చకచకా చేసేశారు. ఓ వైపు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు నడుస్తుండగానే మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంటనే అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించి ప్రొసీడింగ్ చేస్తుండగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలైనా అందలేదు. కాపీలు అందడంలో ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ కోసం జైలు అధికారులు క్లాస్-1 (మంజీర) బ్యారక్‌ను సిద్ధం చేశారు. బెయిల్ వచ్చినా విడుదల ప్రక్రియ ఆలస్యం కావడానికి పద్ధతి ప్రకారం, వ్యూహ్యాత్మకంగా సీఎంవో కనుసన్నల్లోనే అంతా జరిగిందని బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో హైడ్రా కూల్చివేతలు కూడా శుక్రవారం సాయంత్రమే చేపట్టడం, కోర్టుకు వెళ్లే సమయం ఇవ్వకపోవడం, శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు కావడం వంటి అవకాశాలను వాడుకున్నారని, సోమవారం కోర్టుకు వెళ్లినా ఆ లోపే అంతా కూల్చివేసి కుట్రపూరితంగా వ్యవహరించేవారని గుర్తుచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కార్ పెద్దల డైరెక్షన్ మేరకు కనీసం ఒక్కరోజైనా అల్లు అర్జున్ను జైల్లో పెట్టాలనే కుట్ర వ్యూహాత్మకంగా ఫలించిందని రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. కావాలనే జైలు మాన్యువల్ ప్రకారం సాయంత్రం ఆలస్యంగా చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు తెలుస్తున్నది. జైలు మ్యాన్యువల్ ప్రకారం ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటల లోపు బెయిల్ బాక్స్‌ను ఓపెన్ చేస్తుంటారు. వారు ఓపెన్ చేసే సమయానికి బెయిల్ పొందిన సంబంధిత వ్యక్తుల బెయిల్ పేపర్లు అందులో ఉండాలి. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చిన ఏ బెయిల్ పేపర్లు అయినా జైలు నిబంధనల ప్రకారం మరుసటి రోజు ఉదయమే ఓపెన్ చేసి, బెయిల్ ప్రాసెస్ మొదలు పెడతారు. ఈ క్రమంలో కావాలనే 6 గంటలు దాటినా బెయిల్ పేపర్లు ఇవ్వలేదని సమాచారం. ఈ క్రమంలో కనీసం ఒక్కరోజైనా అల్లు అర్జున్ను జైలులో ఉంచాలనే ఆశయం నెరవేర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.