హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సంధ్య థియేటర్ యజమాన్యం బందోబస్తు కోసం లెటర్ ఇన్‌వార్డులో ఇచ్చారని, ఆ తర్వాత పోలీస్‌స్టేషన్, ఏసీపీ, డీసీపీలను కలిసి ఈవెంట్ గురించి వివరించలేదని సెంట్ర ల్ జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ తెలిపారు. థియేటర్లో తొక్కిసలాట జరగడానికి అల్లు అర్జున్ రెండు గంటల పాటు అక్కడ ఉండడమే కారణమని వెల్లడించారు. తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇన్నాళ్లూ తమకు హీరో వస్తున్నట్టు ముందస్తు సమాచారం లేదంటూ చెప్తూ వచ్చారు. తాజాగా సంధ్య థియేటర్ యజమాన్యం డిసెంబర్ 4న సినిమా ప్రీమియర్ షో ఉన్నదని దీనికి అల్లు అర్జున్ ఆయన టీమ్ వస్తున్నందున బందోబస్తు ఇవ్వాలని చిక్కడపల్లి పీఎస్‌లో డిసెంబర్ 2న ఇచ్చిన దరఖాస్తు కాపీ శుక్రవారం బ హిర్గతమైంది. దీంతో పోలీసులు నీళ్లు నములుతూ తమ తప్పేం లేదని, అల్లు అర్జున్‌దే తప్పంటూ ప్లేటు మార్చి ప్రకటన విడుదల చేశారు. ఈ నేపధ్యంలో ఘటనపై వివరణ ఇస్తూ డీసీపీ ప్రకటన జారీ చేశారు. ‘ప్రతి రోజూ మాకు బందోబస్తు కోసం రాజకీయ నా యకులు, ఫిలిం సెలబ్రిటీలు, మతపరమైన ప్రోగ్రా మ్స్ తదిరత అంశాలతో రిక్వెస్ట్‌లు వస్తుంటయి.
సెలబ్రిటీలు వచ్చినప్పుడు అనుమతి కోసం వచ్చే వారు పోలీస్‌స్టేషన్, ఏసీపీ, డీసీపీలను కలిసి ప్రోగ్రాం గు రించి వివరిస్తారు. సంధ్య థియేటర్ యజమాన్యం తరఫున ప్రోగ్రాం గురించి ఎవరూ మాకు చెప్పలేదు. కేవలం ఇన్వార్డ్ సెక్షన్లో లెటర్ ఇచ్చి వెళ్లారు. పోలీసులకు ఎంత మందిని బందోబస్తు విధులకు పంపాలనే విషయంపై స్పష్టత లేదు. థియేటర్ బయట జనాలను బట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. అల్లు అర్జున్ థియేటర్ వరకు వచ్చే దాకా పరిస్థితి అంతా అదుపులోనే ఉన్నది. ఆయన థియేటర్ వద్దకు చేరుకొని తన కారు సన్‌రూప్ నుంచి బయటకు వచ్చి చేతులూపుతూ వెళ్లారు. ఈ సమయంలో ప్రజలు చాలామంది థియేటర్ గేట్ వైపు వెళ్లారు. అదే సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అల్లు అర్జున్ కారు కు దారి కల్పించేందుకు జనాలను పక్కకు నెట్టారు. రెండు గంటల పాటు అర్జున్ థియేటర్లోనే ఉన్నా డు. అతని చర్యలతోనే తొక్కిసలాటకు దారి తీసింది’ అని డీసీపీ వివరించారు. కాగా శుక్రవారం అల్లు అర్జున్ భార్య పట్ల పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ప్రచారం జరుగుతున్నదని, పోలీసులు ఎ వరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు.
తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ఉన్నతాధికారులు నానా తంటాలు పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. థియేటర్ యజమాన్యం, ప్రొడ్యూసర్స్ బందోబస్తు కో రినా పోలీసులు ‘ఏదో’ ఆశించి భంగపడి, భద్రత క ల్పించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీరా అల్లు అర్జున్ను అరెస్టు చేయడంతో అంత సాఫీగా సాగిందనుకున్నారు. కానీ, థియేటర్ యాజమాన్యం భద్రత కోసం పోలీసులకు చేసిన దరఖాస్తు కాపీని కోర్టుకు సమర్పించడంతో సీన్ రివర్స్ అయింది. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసిం ది. ఈ వ్యవహారంలో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మొత్తం చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ చూసుకున్నాడని కొందరు సిబ్బందే చెప్తున్నారు. కాగా ఇది ముమ్మాటికీ నిఘా వైఫల్యమేనని ‘నమస్తే తెలంగాణ’ ముం దుగానే చెప్పింది. షో రాత్రి 9.30 గంటలకు ఉంటే 8 గంటలకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చిన విషయం తెలిసినా స్థానిక పోలీసులు, ఆయా డివిజన్, జోన్ అధికారులు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎందుకు అప్రమత్తం కాలేదనే విమర్శలు వస్తున్నాయి.