Nursing Officers | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ల డిప్యూటేషన్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియార్టీని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని నర్సింగ్ ఆఫీసర్లు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల్లో బోధనా సిబ్బం ది కోసం 84 మంది నర్సింగ్ ఆఫీసర్లను డిప్యూటేషన్‌పై నియమిస్తూ డీఎంఈ డాక్టర్ వాణి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఎస్సీ/బీఎస్సీ నర్సింగ్ అర్హత ఆధారంగా ఈ డిప్యూటేషన్లు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ జాబితాపై సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీనియర్లను పక్కనబెట్టి ఎలాంటి అనుభవం లేని, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి డిప్యూటేషన్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. టీచింగ్ ఫ్యాకల్టీగా అవకాశం ఇవ్వాలని ఎంతో మంది సీనియర్లు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని, అయినా వాటన్నింటినీ పక్కనపెట్టి కావాలనే జూనియర్లకు అవకాశం ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ డిప్యూటేషన్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. హెల్త్ సెక్రటరీ, వైద్యశాఖ మంత్రి వెంటనే స్పందించి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రోగ్రాం నేపథ్యంలో హడావుడిగా ఇచ్చాం..
డిప్యూటేషన్ల అంశంపై నర్సింగ్ విభా గం డీడీ విద్యుల్లతను వివరణ కోరగా.. నర్సింగ్ కాలేజీలను సీఎం ప్రారంభించే కార్యక్రమం నేపథ్యంలో హడావుడిగా ఉ త్తర్వులు జారీ చేసినట్టు చెప్పడం గమనా ర్హం. దవాఖానల్లో సీనియర్ల అవసరం ఉ న్నదని, అందుకే జూనియర్లకు అవకా శం ఇచ్చామని చెప్పుకొచ్చారు. డిప్యూటేషన్లు తాత్కాలికమేనని, రెండుమూడు నెలల తర్వాత పదోన్నతుల్లో భాగంగా ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.