ఖైరతాబాద్, ఫిబ్రవరి 20 : విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు కదంతొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో వందలాదిగా ఉద్యోగులు, కార్మికులు హైదరాబాద్ సోమాజిగూడలోని విద్యుత్ సౌధ ముట్టడికి తరలివచ్చారు. లోపలికి చొచ్చుకుపోయేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. పెరికభవన్, ఖైరతాబాద్ బస్టాండ్, రాజ్‌భవన్ రోడ్, ఎర్రమంజిల్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ అడ్డుకుని 650 మందిని 18 పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆందోళన సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు మాట్లాడుతూ టీజీ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌లలో సుమారు 20 వేలమందికిపైగా ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.
చాలా ఏండ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే విధులు నిర్వహిస్తున్నారని, అర్హత ఆధారంగా కన్వర్షన్ చేయాలని ఐదు నెలల నుంచి వివిధ రూపాల్లో నిరసన చేపట్టామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టివిక్రమార్క, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, జెన్కో సీఎండీ సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీలను కలిసి వరుసగా వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికే చాలామంది ఆర్టిజన్ కార్మికులు మృతి చెందారని, 3వేల మంది రిటైర్ అయ్యారని తెలిపారు. కన్వర్షన్ వల్ల ప్రభుత్వాలకు ఎలాంటి ఆర్థికభారం పడదని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎంఏ వజీర్, కోచైర్మన్లు శంకర్, నరేందర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.