శ్రీరాంపూర్, జూన్ 29: సింగరేణి కార్మికుడిపై ఏఐటీయూసీ నేతలు దాడికి దిగారు. ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే7 గనిపై బుధవారం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేశారు. అక్కడే ఉన్న కార్మికుడు ఎంఏ అజీజ్ హైమద్ సీతారామయ్యను నిలదీశారు. బట్టకాల్చి మీద వేయొద్దని, విమర్శలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. దీంతో ఏఐటీయూసీ నాయకులు ఒక్కసారిగా అజీజ్ హైమద్‌పై దాడిచేశారు. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు నిరూపిస్తే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అజీజ్ హైమద్ సవాల్ విసిరారు. ఏఐటీయూసీ నాయకులు క్షమాపణ చెప్పకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అజీజ్‌పై దాడిని టీబీజీకేఎస్ నాయకులు, ఇతర కార్మికులు ఖండించారు.