కంది, జనవరి 3 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో శనివారం ఇంటర్-ఐఐటీ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్నోవేషన్ మీట్ (2026) ఘనంగా జరిగింది. దేశంలోని 10 ఐఐటీల విద్యార్థులు, ఇతర ఇంజినీరింగ్ కళాశాలల నుంచి సుమారు వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. నూతన టెక్నాలజీతో రూపొందించిన ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. పలు రకాల డ్రోన్లు, సులభంగా ప్రయాణించేలా ఎయిర్ ట్యాక్సీ, చిరు వ్యాపారుల కోసం త్రీవీలర్, సైన్యానికి సామగ్రిని చేరవేసేందుకు చక్రవీర్ పేరుతో భారీ డ్రోన్ తదితర ఎన్నో నూతన ఆవిష్కరణల స్టాల్స్‌ను ప్రదర్శించిన విద్యార్థులు వాటి పనితీరును వివరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ గవర్నర్ బోర్డు చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల కమిషనరేట్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.