హనుమకొండ/హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేత, ఏఐబీఇఏ జాతీయ ఉపాధ్యక్షుడు పీ లక్ష్మీనారాయణ(83) ఇకలేరు. శుక్రవారం సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. సీపీఐకి అనుబంధంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. ఆజంజాహీ మిల్లు, విద్యాసంస్థలు, బీడీ కార్మికులు, వివిధ ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్రేడ్ యూనియన్ చరిత్రలో లక్ష్మీనారాయణ చెరగని ముద్రవేశారని గుర్తుచేసుకొన్నారు. లక్ష్మీనారాయణ మృతి వరంగల్ జిల్లా బ్యాంకు ఉద్యోగులు, కార్మిక, కర్షక, ట్రేడ్ యూనియన్ వర్గాలకు, బడుగు, బలహీన వర్గాలకు తీరనిలోటు అని వినోద్ తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుడిగా తనకు లక్ష్మీనారాయణతో అనుబంధం ఉన్నదని వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వరరావు, సీ రాఘవాచారి, డాక్టర్ రామనాథం తదితరులతో కలిసి లక్ష్మీనారాయణ పనిచేశారని పేర్కొన్నారు.