జహీరాబాద్, ఆగస్టు 30 : ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ధర భారీగా పెరుగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు దానిని కొనలేని స్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో చెరుకుకు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు, నిఫుణులు చక్కెర దుంప(షుగర్ బీట్) పంటను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. దేశంలోని పంజాబ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో ఈ పంటను పండించేందుకు అక్కడి రైతులను ప్రోత్సహిస్తున్నారు. చెరుకు పంట చేతికి రావాలంటే కనీసం ఏడాది పడుతుంది.
పైగా నీళ్లు ఎక్కువగా అవసరం. తెగుళ్ల బెడద, క్రిమిసంహారాల ఖర్చు కూడా ఎక్కువే. చెరుకు సాగులో ఉన్న ఈ ఇబ్బందులను చక్కెర దుంప తీర్చనున్నది. ఈ పంట నాలుగు నెలల్లోనే చేతికొస్తుంది. ఎలాంటి నేలలోనైనా పండుతుంది. రాబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ. కాబట్టి రైతులను ఈ పంటవైపు మొగ్గు చూపేందుకు హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్‌సార్ వ్యవసాయ విశ్వవిద్యాయం శాస్త్రవేత్తలు, నిఫుణులు పరిశోధనలు చేపట్టారు. ఆయా రాష్ర్టాల మాదిరిగానే ఈ పంటను ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్‌పూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంతోపాటు ఏపీలోని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈ పంటను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు.
చక్కెర దుంప చూడటానికి పాలకూర లాంటి ఆకులతో, ముల్లంగిని తలపించే ఆకృతితో ఉంటుంది. చెరుకు లాగానే దీనిలో కూడా సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ గుజ్జుని పాకం పట్టి చక్కెర తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చెరుకు పంట చేతికి రావాలంటే కనీసం ఏడాది పడుతుంది. తెగుళ్లు, క్రిమికీటకాల బెడద ఎక్కువ. ఎక్కువ నీళ్లు పెట్టాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఖర్చు ఎక్కువతోపాటు అనేక సమస్యలూ ఉంటాయి. ఈ పంట సమశీతోష్ణ వాతావరణంలో బాగా పండుతుంది. అయినప్పటికీ ఉష్ణమండల ప్రాంతాలకు సరిపోయే రకాలపై శాస్త్రేవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా ఈ పంటకాలం సుమారు 120 రోజుల నుంచి 150 రోజులు ఉంటుంది. భూమిని లోతుగా దున్ని మెత్తగా చేసుకోవాలి. ఎకరానికి సుమారుగా 1 నుంచి 1.50 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
విత్తిన 3వ రోజున తొలి తడి ఇవ్వాలి. మొక్కల పెరుగుదల దశలో 10-15 రోజులకు ఒకసారి నీరు అందించాలి. పంట కోతకు 2-3 వారాల ముందే నీటితడులు ఆపేయాలి. సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే హెక్టార్‌కు 35 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చెరుకు మాదిరిగానే ఈ దుంపల నుంచి మొలాసిస్, దాని నుంచి ఇథనాల్ తయారుచేస్తారు. వాటి వ్యర్థాలను బిల్డింగ్ మెటీరియల్‌గా వాడుకోవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగిస్తున్నారు. ఇక దుంప నుంచి వచ్చిన పిప్పిని ప్రాసెస్ చేసి చెరుకుగా వాడుకుంటున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉండే దుంప ఆకులకు పశుగ్రాసంగా మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నది. ఫార్మా, కాస్మోటిక్స్ రంగాల్లో దుంప చక్కెర వినియోగం పెరిగింది. ప్రపంచ దేశాలు కూడా చెరుకు స్థానంలో చక్కెర దుంప సాగువైపు మొగ్గుచూపుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని ఆయా వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ఈ పంటను ప్రయోగాత్మకంగా సాగుచేసి పరిశోధనలు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంత్‌పూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో చెరుకు, గోధుమ, షుగర్బీట్ పంటలపై పరిశోధనలు చేస్తున్నారు. చెరుకు పంటలో దాదాపు 170 రకాల పరిశోధనలు చేశారు. ఈ ప్రాంతం పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలు ఎంపికచేసి, వాటిపై పరిశోధనలు చేసి రైతులకు అందజేశారు. వాటిలో 8005, 93V297, 83A30, 86032, 9520, 87025 రకాలు ఉన్నాయి. చెరుకు ప్రత్యామ్నాయంగా షుగర్ బీట్‌ను పండిస్తున్నారు. ప్రస్తుతం రైతులు పండిస్తున్న చెరుకు కర్ర రూపంలో ఎత్తుగా ఎదుగుతుంది. కానీ, షుగర్బీట్ మాత్రం భూమిలోపల దుంప రూపంలో పండుతుంది. విజయ్‌కుమార్ పర్యవేక్షణలో 8 రకాలపై పరిశోధనలు చేస్తున్నారు. చెరుకు కాకుండా గోధుమ పంటలో 45 రకాలపై పరిశోధనలు చేశారు. వాటిలో ప్రధానంగా డీడబ్ల్యూఆర్162, పీడీడబ్ల్యూ 533, ఆదిత్య, ఎంఏసీఎస్ రకాలు ఉన్నాయి.
పద్దెనిమిది వందల ఏండ్ల క్రితం యూరప్ దేశాలన్నీ నిత్యావసరమైన చక్కెర కోసం బ్రిటన్ దేశంపైనే ఆధారపడేవి. ఈ విషయంలో బ్రిటన్ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయాలని అప్పట్లో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ చెరుకుకు ప్రత్యామ్నాయంగా పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలు, నిఫుణులను ఆదేశించారు.

వారి పరిశోధనలతోనే ఈ చక్కెర దుంప ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిందని జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.
చక్కెర, ఇథనాల్ తయారీకి ఉపయోగపడే చక్కెర దుంప సాగుపై ప్రయోగాత్మకంగా 8 రకాల పరిశోధలు చేపడ్తున్నాం. ఈ పంట సమశీతోష్ణ వాతావరణంలో బాగా పండుతుంది. అయినప్పటికీ ఉష్ణమండల ప్రాంతాలకు సరిపోయే రకాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఈ పంట సాగు, యాజమాన్య పద్ధ్దతులు, నూతన వంగడాలు రూపొందించే పరిశోధనలు చేపడ్తున్నాం. ఈ పంటతోపాటు చెరుకు, గోధుమ పంటలపైనా పరిశోధనలు చేసి కొత్త వంగడాలు సృష్టిస్తున్నాం.
-డాక్టర్ విజయ్‌కుమార్, బసంత్‌పూర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త