Gurukula Teachers | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో చేపట్టిన బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. రాష్ట్రంలోని ఏ సొసైటీలోనూ, మ రే శాఖలోనూ లేనివిధంగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులే నిదర్శనంగా నిలుస్తాయి. 317 జీవోతో డిస్లోకేట్ అయినవారు, కోర్టు కేసులతో కౌన్సెలింగ్‌కు హాజరుకాని ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండానే రిలీవ్ చేయాలని రాత్రికి రాత్రే ఆదేశాలు జారీ చేశారు. దీంతో బెంబేలెత్తిన ఉద్యోగులు హుటాహుటిన డీఎస్ఎస్ భవన్‌కు తరలివచ్చి ఇదేమిటనీ నిలదీశారు.
రాత్రికి రాత్రే రిలీవ్
సోషల్వెల్ఫేర్ గురుకులంలో ఇటీవలనే బదిలీలను నిర్వహించారు. 317 జీవోతో డిస్లొకేట్ అయిన బోధన, బోధనేతర సిబ్బందికి సైతం కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ కోర్టు కేసుల నేపథ్యంలో పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే వారి పోస్టులను మాత్రం వేకెంట్ (ఖాళీ)గా చూపెట్టారు. ఈ క్రమంలో ఒకే సబ్జెక్టుకు సంబంధించి ఒకే చోట ఒకరికి మించి ఉద్యోగులకు పోస్టింగ్‌లు వచ్చాయి. అదీగాక సీనియార్టీ జాబితాను తప్పులతడకగా రూపొందించి, ఇష్టారాజ్యంగా బదిలీలను చేపట్టారు. కోర్టు కేసుల నేపథ్యంలో బదిలీల కౌన్సిలింగ్‌కు హాజరు కాని 292 ఉన్నారు. వారందరినీ రిలీవ్ చేయాలని ప్రిన్సిపాల్స్‌కు మం గళవారం రాత్రి హడావుడిగా సొసైటీ సెక్రటరీ ఆదేశాలు జారీచేశారు.
గురుకులాల్లో ఉన్న అదనపు సిబ్బందిని మాత్రం మినహాయించారు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. రిలీవ్ అయిన టీచర్లందరూ హుటాహుటిన బుధవారం ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తారేమోనని వచ్చిన సిబ్బందికి చుక్కెదురైంది. ఆప్షన్స్‌ను తీసుకోకుండా కేవలం సమస్యలు మాత్రమే చెప్పుకొని వెళ్లాలని సొసైటీ చెప్పడంతో వచ్చిన టీచర్లందరూ ఖంగుతిన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కోర్టు ఉత్తర్వులను యథేచ్ఛగా ఉల్లంఘించింది. కోర్టు స్టే విధించినప్పటికీ బదిలీలు చేపట్టింది. మరోవైపు 317 జీవోతో ప్రభావితమైన సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఇంతవరకు ఎటువంటి సిఫారసులు చేయలేదు. కానీ సొసైటీ మాత్రం ఆ జీవోతో ప్రభావితమైన వారికి పోస్టింగ్లివ్వడం గమనార్హం.
టీచర్లమా..? అడ్డా కూలీలమా..?
రాత్రికి రాత్రే రిలీవ్ చేసి, ఉదయమే ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారు చంటిపిల్లలను పట్టుకు ని, 500-600కిమీ ప్రయాణం చేసి బుధవారం సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం బయట, పార్కింగ్ షెడ్డు కింద ఎండలో టీచర్లను నిలబెట్టి అభ్యంతరాలు స్వీకరించారు. దీంతో కార్యాలయం ఎదుట బైఠాయించి, ధర్నా కు దిగారు. ‘టీచర్లు ఆందోళన మొదలుపెట్టిన అరగంటలోనే 177 మందికి పోస్టింగ్స్ ఇస్తూ సొసైటీ సెక్రటరీ వర్షిణి ఉత్తర్వులు జారీచేశారు. అది కూడా జూలై 21వ తేదీతో ఉత్తర్వులు వెలువరించడం గమనార్హం. ఇంకా వందల మంది ఉద్యోగులకు పోస్టింగ్స్ కూడా ఇవ్వలేదు. దీంతో తాము ఇప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. సెక్రటరీ వర్షిణి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న టీచర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోస్టింగ్స్ ఇచ్చామని, కోర్టు ఆదేశాలతో పనిలేదని అన్నారు. పోస్టింగ్స్ వచ్చిన చోటుకు వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు. హైకోర్టులో స్టేఆర్డర్ ఉన్న కూడా సొసైటీ ఉన్నతాధికారులు అందుకు పూర్తి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం దారుణమని టీఎస్డబ్ల్యూఆర్టీఈఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు వాపోయారు.