ఖైరతాబాద్, మే 21: కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్రంలోని వేలాది మంది కుట్టుపని కార్మికుల పొట్టలు కొట్టిందని ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కార్మికుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ప్రతినిధులు మాడిశెట్టి లక్ష్మీనారాయణ, వరలక్ష్మి తదితరులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందికిపైగా ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుట్టుపనిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. దశాబ్దాలుగా దర్జీ, టైలర్లకే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల యూనిఫామ్స్ వర్క్ ఆర్డర్ ఇచ్చేవారని చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే తమను కాదని, డ్వాక్రా గ్రూపులకు పనులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం గడువు సమీపిస్తుండటంతో అది వికటించి యూనిఫామ్ కుట్టుపనులను అధికారులు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినట్టు తమ దృష్టికి వచ్చిందని ఆరోపించారు. అనంతపురం, విజయవాడ, షోలాపూర్‌కు చెందిన ప్రైవేట్, కొన్ని కార్పొరేట్ ఏజెన్సీలకు డీఆర్డీఏ, మెప్మా అధికారులు అప్పగించారని, కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఆ ఏజెన్సీల వద్ద కూడా కుట్టు పని జాప్యం అవుతుండటంతో సంబంధిత అధికారులు తిరిగి పాత కార్మికులకు ఫోన్లు చేసి ఆర్డర్ ఇస్తామంటున్నారని చెప్పారు. ప్రస్తుతం జతకు రూ.50 మాత్రమే ఇస్తున్నారని, ఒకవేళ పనులు చేసినా ఆ ధరకు కుట్టుగూళ్లు గిట్టుబాటు కాదని చెప్పారు.
పన్నెండు ఏండ్లపాటు మా జీవనాధారమైన ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపనులు ఈ సారి లేక కుటుంబ జీవనం భారమైందని నల్లగొండ జిల్లాకు చెందిన పావని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన భర్త ఫుడ్ డెలివరీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపారు. పదేండ్లపాటు ఉపాధి కల్పించిన యూనిఫామ్స్ కుట్టుపని ఈ ఏడాది లేక తన భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని హైదరాబాద్ చంపాపేటకు చెందిన జయంతి తెలిపారు. ఆ వచ్చే ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వృత్తిపని కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆదరణ ఉన్నదని, కాంగ్రెస్ హయాంలో పట్టింపే లేదని మీర్‌పేటకు చెందిన దొంతం వెంకట్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చుడుతోనే మా పొట్టలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.