Unemployment | హైదరాబాద్, జూలై 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభం తర్వాత గతంలో ఎన్నడూ చూడని రీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం.. మే నెలలో 7.68 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జూన్ నాటికి 8.45 శాతానికి ఎగబాకింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 7.87 శాతానికి, గ్రామాల్లో 8.73 శాతానికి చేరింది. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత గ్రామాల్లో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరగడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, ఆచరణలో అది జరగడంలేదని సీఎంఐఈ తాజా నివేదికను బట్టి అర్థమవుతున్నది. దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో కేవలం 43 శాతం మందికే ఉద్యోగాలు ఉండగా, ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగాలు కావాల్సినవారు 22 కోట్ల మంది వరకు ఉన్నట్టు ఎన్జీవోలు చెప్తున్నాయి.