అచ్చంపేట : శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (SLBC Tonnel) ప్రమాదంలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి మృతదేహాలు వెలికితీతకు సహాయక చర్యలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే.
టన్నెల్లో విధులు నిర్వహించడానికి కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు 50 మంది లోపలికి వెళ్లగా ప్రమాదం జరిగిన వెంటనే అతి కష్టం మీద 42 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఎనిమిది మంది లోపల జల సమాధి అయ్యారు. 8 మంది మృతదేహాలలో 16వ రోజు పంజాబ్ ( Punjab ) రాష్ట్రానికి చెందిన మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, 25వ రోజున యూపీకి(UP) చెందిన కంపెనీ ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మిగిలిన ఆరుగురి కోసం కేంద్ర, రాష్ట్ర 12 సంస్థలకు చెందిన రెస్క్యూ సిబ్బంది ( Rescue Team ) నిరంతరం అన్వేషణ చేస్తున్నారు. సహాయక చర్యల్లో అడ్డంకులను అధిగమిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. 50 రోజులుగా అక్కడే ఉంటూ మృతదేహాలను వెలికి తీయడమే లక్ష్యంగా రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్న కానీ మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆచూకీ నేటికి లభించలేదు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ , సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వివరించారు. సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తూ, ఏ రోజుకారోజు సహాయక చర్యలకు కావలసిన సామాగ్రిని, సిబ్బందిని సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతి రోజూ మూడు షిఫ్టుల్లో సహాయక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలియజేశారు .