హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ పటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా ఆఫ్రికా ఖండం చీలిపోతున్నది. తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల (భూమి ఫలకాల) కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడబోతున్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. అయితే, వాళ్లు ఊహించిన దాని కంటే వేగం గా ఈ పరిణామం జరుగుతున్నట్టు తాజాగా వెల్లడైంది. రానున్న 50 లక్షల ఏండ్ల నుంచి కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యి.. భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం ఉన్నట్టు నాసా, అమెరికా జియోలాజికల్ సర్వే, యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకుల బృందం తెలిపింది.
ప్రస్తుతం భూమిపై పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహా సముద్రాలు ఉన్నాయి. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్ వరకు విస్తరించి ఉన్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని భూ అంతర పొరల్లో రాపిడిల వల్ల నుబియన్ టెక్టానిక్ ప్లేట్ నుంచి సోమాలియన్, అరేబియన్ టెక్టానిక్ ప్లేట్స్ విడిపోతున్నాయని, దీంతో ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ హిందూ మహా సముద్రం నీటితో కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇథియోపియా, కెన్యా లాంటి ప్రాంతాల్లో భూమి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటం తెలిసిందే.