సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ సోషల్‌మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్న ఒక ఘరానా మోసగాడిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన మహ్మద్ రఫీక్ పంచపురి కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులలో ఉండటంతో భార్య విడిపోయింది. దీంతో ఎలాగైన డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా రఫీక్ మహ్మద్ పేరుతో ఫేస్బుక్ ప్రొఫైల్ తయారు చేసి, పీహెచ్డీ ఫేస్బుక్ గ్రూప్‌లో చేరాడు. గ్లోబర్ ఎడ్యుకేటర్ కన్సల్టెన్సీ పేరుతో ప్రకటనలు ఇచ్చాడు. వారణాసిలో పేరున్న యూనివర్సిటీలలో పీహెచ్డీ అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ ప్రకటించి, తన ఫోన్ నంబర్లను కూడా ఆయా ప్రకటనల్లో అందుబాటులో ఉంచాడు. చాలా మంది అతడిని నమ్మి ఫోన్ చేశారు. ముందుగా అడ్మిషన్ ఫీ, సెమిస్టర్ ఫీ, ఎగ్జామ్ ఫీ.. అంటూ డబ్బులు వసూలు చేశాడు. అడ్మిషన్లకు చెందిన నకిలీ డాక్యుమెంట్లు బాధితులకు పంపించి మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మీర్‌పేటకు చెందిన బాధితుడు ఈ ప్రకటన చూసి సంప్రదించాడు. నిధి సింగ్ అనే పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా ఇచ్చి అందులో డబ్బులు డిపాజిట్ చేయమని సూచించాడు. బాధితుడు రూ. 4.8 లక్షలు డిపాజిట్ చేసినా, ఇంకా డబ్బు కావాలంటూ డిమాండ్ చేశాడు. అడిగిన వెంటనే డబ్బు ఇవ్వకపోవడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గురుగావ్‌లో ఉన్నట్లు గుర్తించిన ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది. నిందితుడిపై జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.