Medical PG | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో సుప్రీంకోర్టు స్థానిక కోటాను రద్దు చేయడంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో 2,700 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇందులో 50 శాతం ఆల్ ఇండియా కోటా అమలవుతుండగా.. మిగతా 50 శాతం లోకల్ కోటా అమలు చేస్తున్నారు. స్థా నిక కోటా కారణంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు వెయ్యికి పైగా సీట్లలో అవకాశాలు లభిస్తున్నాయి. కానీ తాజా తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. ఉత్తరాది కన్నా దక్షిణాది రాష్ట్రాల్లోనే మెడికల్ కాలేజీలు, పీజీ సీట్లు ఎకువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆలిండియా కోటాలో జరుగుతున్న అడ్మిషన్లను పరిశీలిస్తే ఉత్తరాది విద్యార్థులే ఎకువగా ఉంటున్నారని చెప్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే తెలంగాణ విద్యార్థులకు నష్టం తప్పదని పేరొంటున్నారు.
సుప్రీంకోర్టు గతంలోనే సూపర్ స్పెషాలిటీ సీట్లలో స్థానిక కోటాను రద్దు చేసింది. తాజాగా పీజీలోనూ స్థానిక కోటాను రద్దు చేయడంతో లోకల్‌గా నిపుణుల కొరత ఏర్పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ చదివే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది తెలంగాణలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్థానిక కోటా రద్దుతో పీజీ సీట్లలో ఎకువగా ఇతర రాష్ట్రాల వారే చేరే అవకాశం ఉంది. దీంతో పీజీ కోర్సు అయిపోయిన తర్వాత వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతారని, దీంతో స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ దవాఖానలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు దరఖాస్తు చేసే వారి సంఖ్య కూడా తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లో సేవలు అందించే డాక్టర్లకు ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ సీట్లలో అవకాశం కల్పిస్తున్నారు. లోకల్ క్యాటగిరీలో కన్వీనర్ కోటా కింద వచ్చే సీట్లలో ఈ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. క్లినికల్ సీట్లలో 20 శాతం, నాన్ క్లినికల్ సీట్లలో 30 శాతం ఇన్ సర్వీస్ కోటా కింద రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టు స్థానిక కోటాను రద్దు చేసిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ కోటాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లలో ఇన్ సర్వీస్ కోటా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే న్యాయస్థానాలు తిరసరించాయి. ఒకవేళ పీజీ సీట్లలో ఇన్ సర్వీస్ కోటా రద్దు అయితే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేసేందుకు డాక్టర్లు దొరకడం కష్టం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ సుప్రీంకోర్టు తీర్పుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదురొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.