ఖైరతాబాద్, ఫిబ్రవరి 5 : సంచార జీవితాలను గడుపుతున్న హోలియా దాసరులను గ్రూప్-3లో కలపడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని రాష్ట్ర హోలియా దాసరి సంక్షేమ సంఘం అధ్యక్షుడు తంటం జహంగీర్ మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు లక్ష వరకు హోలియా దాసరుల జనాభా ఉంటుందని, నేటికీ పిన్నీసులు, కాంటాలు, వెంట్రుకలు, వీధి బాగోతాలు ఆడుతూ సంచార జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. 20 శాతం మందికి కుల సర్టిఫికెట్లు కూడా లేవని పేర్కొన్నారు. తమను సంపన్నులు ఉండే గ్రూప్-3లో చేర్చటం బాధాకరమని, ప్రభుత్వం పునఃసమీక్షించి గ్రూప్-1లో కలపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు రావుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆరెళ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.