Adarsh nagar | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ల్యాంకో హిల్స్ నుంచి ఔటర్ రింగురోడ్డు వరకు ప్రభుత్వం చేపట్టిన వంద అడుగుల రహదారిని మాత్రం ఓ సొసైటీ అడ్డుకొంటున్నది. ప్రజా ప్రయోజనాల కోసం వేస్తున్న ఆ రోడ్డు తమ సొసైటీ భూముల మీదుగా వెళ్లొద్దంటూ వితండ వాదం చేస్తున్నది. రెండేండ్ల కిందటే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, హెచ్ఎండీఏ అభ్యంతరాల నోటిఫికేషన్‌కు స్పందిం చకుండా, 9 నెలల పాటు అభ్యంతరం తెలుపని ఆ సొసైటీ, ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న ది. స్పందించలేదు. ఇదే రోడ్డుకు ప్రైవేటు వ్యక్తులు, ఇతర సొసైటీలు స్థలాలను అప్పగించగా, అందరికీ తాము అతీతం అన్నట్టు ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన ఆదర్శ్‌నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వ్యవహరిస్తున్నది.
నిబంధనల ప్రకారమే పనులు ప్రారంభం
2021లో హెచ్ఎండీఏ ‘రోడ్డు అభివృద్ధి ప్రణాళిక (ఆర్డీపీ)’ కింద వంద అడుగుల మేర 13 రోడ్లను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా పుప్పాలగూడ మీదుగా ల్యాంకోహిల్స్ నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు 3.89 కిలోమీటర్ల మేర వంద అడుగుల రోడ్డును ప్రతిపాదించారు. అయితే, ఈ రోడ్డు పుప్పాలగూడలోని ఆదర్శ్‌నగర్ హౌసింగ్ సొసైటీ సర్వే నంబర్ 452/1, 454/1 భూమి (2007లో అప్పటి ప్రభుత్వం ఐఏఎస్/ఐపీఎస్‌లకు ఇచ్చిన ఇండ్ల స్థలాల ప్రాంతం) మీదుగా వెళ్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి 2021 మే 18న ముసాయిదా నోటిఫికేషన్ (మెమో నంబర్ 6992/ప్లానింగ్/2021) జారీ చేశారు.
పత్రికల్లోనూ నోటిఫికేషన్ ప్రచురించి, ప్రజలకు అభ్యంతరాలున్నా, సూచనలు ఇవ్వాలనుకున్నా స్పందించాలని కోరారు. ఇందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను అధికారులు పరిశీలించి, పరిష్కరించారు. ఈ సమయంలో ఆదర్శ్‌నగర్ హౌసింగ్ సొసైటీ ఎలాంటి అభ్యంతరాన్ని లేవనెత్తలేదు. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 2021 జూలై 8న జీవో జారీ చేసింది. 2021 ఆగస్టు 27న గెజిట్ కూడా ప్రచురితమైంది. రోడ్డు నిర్మాణానికి అవలంబించాల్సిన, అమలు చేయాల్సిన నిబంధనలను హెచ్ఎండీఏ అధికారులు సక్రమంగా పూర్తి చేశారు.
తొమ్మిది నెలలపాటు స్పందన కరువు
హెచ్ఎండీఏ అధికారులు నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం హెచ్ఆర్డీసీఎల్ (హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా పనులు మొదలుపెట్టింది. 2021 అక్టోబర్‌లో ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. సదరు సొసైటీకి చెందిన స ర్వే నంబర్ 452/1, 454/1లోనూ నిర్మాణ పనులు జరిగాయి. తొమ్మిది నెలల తర్వాత అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. న్యాయపరమైన చిక్కులు తెచ్చేందుకు సొసైటీ ప్రయత్నిస్తున్న ది. నిబంధనల ప్రకారం రోడ్డు పనులు కొనసాగించిన అధికారులు బీటీ రోడ్డు వేశారు.
మిగిలి ఉన్న చిన్నపాటి పనులను పూర్తిచేసేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లగా, సొసైటీ వాళ్లు అడ్డుపడ్డారు. శనివారం సాయంత్రం కూడా పనులకు అడ్డు తగిలారు. ఒకవైపు మహా నగరంలో పేదలు సైతం అభివృద్ధి నిర్మాణాలకు స్వచ్ఛందంగా తమ స్థలాలు, ఇండ్లు ఇచ్చి భాగస్వాములవుతుండగా, బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న వాళ్లు అభివృద్ధి పనులకు అడ్డు తగలడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులు నిలిపివేసేందుకుగాను పురపాలక శాఖ ఉన్నతాధికారులపై సివిల్ సర్వెంట్లతోకూడిన సొసైటీ ప్రతినిత్యం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటంపై జనం మండిపడుతున్నారు.
అలైన్మెంట్ మార్చాలని పట్టు!
ప్రైవేట్ భూములను సేకరించేందుకు అధికారులు నిబంధనల ప్రకారం ఓ రియల్ సంస్థ, ఉదయ్‌నగర్ హౌసింగ్ సొసైటీ, ఎమ్మెల్యే/ఎంపీ కాలనీతోపాటు ఆదర్శ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి లేఖ రాశారు. రోడ్డు నిర్మాణానికిగాను భూమిని అప్పగించాలని, పరిహారం కింద 400 శాతం విలువైన టీడీఆర్ (ట్రాన్స్ఫరెబుల్ డెవలప్మెంట్ రైట్స్)ను కూడా ప్రభుత్వం ఇస్తుందని సంబంధిత లేఖల్లో పేర్కొన్నారు. ఆదర్శ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి ఇదేరీతిన 2021 సెప్టెంబర్ 22న లేఖ రాశారు. అయితే, నిబంధనల ప్రకారం అభ్యంతరాలు తెలుపాల్సిన సమయంలో స్పందించని హౌసింగ్ సొసైటీ.. హెచ్ఎండీఏ అధికారులు లేఖ రాసిన తర్వాత స్పందించింది.
అలైన్మెంట్ మార్చాలని పట్టుబట్టింది. తమ భూములకు ఉత్తరం వైపున ఉన్న ప్రభుత్వ భూముల మీదుగా రోడ్డు వేయాలని సూచించింది. దీంతో హెచ్ఎండీఏ అధికారులు సొసైటీ సూచించిన మేరకు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌పై సర్వే చేశారు. కానీ దాని ప్రకారం ఉన్న రోడ్డు పుప్పాలగూడలోని సర్వేనెంబర్ 452/1లో ఫక్రుద్దీన్ అలియా దర్గా అనే వారసత్వ నిర్మాణం మీదుగా వెళ్తున్నది. 2009లోనే ఈ నిర్మాణాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించి అప్పటి ప్రభుత్వం (జీవో నంబర్ 68, 3.2.2009) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రత్యామ్నాయ అలైన్మెంట్ సాధ్యం కాదని సొసైటీ ప్రతిపాదనను అధికారులు తిరస్కరించారు.