హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఆలోచనలు ఉత్తమంగా ఉంటే ఆవిష్కరణలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ సినీ నటుడు, ఇండియన్ ఇన్వెస్టర్ రానా దగ్గుబాటి అన్నారు. స్టార్టప్‌లతో సత్తా చాటాలని యువతకు పిలుపునిచ్చారు. నేటి తరం యువత తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మలుచుకొనేందుకు టీహబ్ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. టీహబ్ ప్రారంభోత్సవంలో మంగళవారం ఆయన కీలకోపన్యాసం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో అవకాశాలకు దారి చూపుతుందని తెలిపారు. టెక్నాలజీపై మంచి పట్టు ఉన్న యువతరం నేటి సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై ఉద్యోగులతోపాటు విద్యార్థులూ దృష్టి సారించాలన్నారు. ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యద్భుత వాతావరణాన్ని సృష్టించిందని కొనియాడారు. అంతకుముందు టీహబ్‌లోకి అడుగుపెట్టిన రానాను అందరూ కేరింతలు కొడుతూ ఆహ్వానించారు. అనంతరం ఆయన టీహబ్‌లోని మౌలిక వసతులను పరిశీలించారు. స్టార్టప్ షోకేస్‌లో ప్రదర్శించిన పలు స్టార్టప్‌లను సందర్శించి, వాటి పనితీరు గురించి తెలుసుకొన్నారు.