హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పదవీ విరమణ చేసిన ఉద్యోగి దంపతులకు అన్ని పనులు చేసి పెడుతూ నమ్మకమైన వ్యక్తులుగా నిలిచి రూ.ఐదు కోట్లు లాగేశారు కేటుగాళ్లు. ఇన్సూరెన్స్ పాలసీల్లో పెట్టుబడులంటూ బురిడీ కొట్టించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మోసాన్ని శుక్రవారమే సీసీఎస్ ఏసీపీ రవీందర్‌రెడ్డి బృందం ఛేదించింది. నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం కొన్ని నంబర్లకు ఎంపికచేసుకొని ఫోన్‌చేసి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అభ్యర్థిస్తుంటాడు. ఎవరైనా సరేనంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లయిన మనోజ్‌కుమార్, మహేశ్‌గౌడ్‌ను పంపి డబ్బు వసూలుచేసి నకిలీ బాండ్లు అంటగట్టి ముఖం చాటేస్తాడు. 2020లో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలో హైదరాబాద్ మోతీనగర్‌లో ఉంటున్న రిటైర్డు ఉద్యోగి రామరాజు(74)కు సుబ్రహ్మణ్యం ఫోన్‌చేసి బుట్టలో పడేశాడు. ఇంట్లో దంపతులు ఇద్దరే ఉండటం, వారి ఇద్దరు కుమారులు లండన్, అమెరికాలో ఉన్నారని తెలుసుకున్నాడు.
అదే సమయంలో రామరాజు భార్యకు కరోనా సోకడంతో అండగా నిలిచి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చి, దవాఖానకు తీసుకెళ్లి నమ్మకం పెంచుకొన్నాడు. ఇలాంటి సమయంలోనే ఇన్సూరెన్స్ చేసుకోవాలంటూ రామరాజును నమ్మించిన సుబ్రహ్మణ్యం, ఇద్దరు స్నేహితులతో కలిసి పాలసీ చేయాలంటూ వృద్ధ దంపతుల నుంచి విడతలవారీగా రూ.5 కోట్లు కొట్టేశారు. రెండేండ్లుగా డబ్బు కావాల్సినప్పుడల్లా మార్కెట్లోని కంపెనీల పేరిట పాలసీలు చేశామని నకిలీబాండ్లు ఇస్తూ వారిని నమ్మించారు. ఆ డబ్బుతో ముగ్గురూ తమ కుటుంబాలతో విమాన్లాలో తిరుగుతూ జల్సాలు చేశారు. కార్లు, బంగారం కొన్నారు. తాము పంపిన డబ్బంతా ఏం చేశారని ఇటీవల కుమారులు ప్రశ్నించగా, ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెడుతున్నానని రామరాజు చెప్పాడు. ఆ బాండ్లను పరిశీలించగా నకిలీవని తేలడంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.