Praja Palana | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోటకు చెందిన తోటపల్లి రవికుమార్ జనవరి 3న ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకున్నా రు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు వర్తింపజేయాలని కోరారు. అధికారులు రసీదు ఇచ్చారు. అయినా ఏ పథకం ఆయనకు వర్తించలేదు. అధికారులను అడిగితే తమకు వివరాలు అందలేదని చెప్పారు. మండల కార్యాలయానికి వెళితే ప్రజాపాలన దరఖాస్తు ఆన్లైన్లో నమోదు కాలేదని చెప్పేశారు. అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ఆయన హైదరాబాద్ ప్రజాభవన్ ప్రజావాణిలోనూ ఫిర్యాదులు చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు.
భారీగా దరఖాస్తులు మిస్సింగ్
ప్రజాపాలన దరఖాస్తులను ప్రభుత్వం గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తీసుకున్నది. 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరుసటిరోజు నుంచే మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా వివరాలను ఆన్లైన్లో నమోదు ప్రారంభించారు. 1.25 కోట్ల దరఖాస్తుల డాటా ఎంట్రీకి ప్రభుత్వం 10 రోజు ల సమయమే ఇచ్చింది. కొన్నిచోట్ల దరఖాస్తులను ఇండ్లకు పంపించి డాటా ఎంట్రీ చేయించారు. హైదరాబాద్ హయత్‌నగర్‌లో బైక్‌పై తీసుకెళ్తుండగా పత్రాలన్నీ రోడ్డుపై పడిపోయా యి.
12వ తేదీకే డాటా ఎంట్రీ పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఫిబ్రవరి ఒకటిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించగా అధికారులు 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయ ని చెప్పారు. 2.82 లక్షల దరఖాస్తులకు ఆధార్, రేషన్ నంబర్ జతచేయలేదని, వివరాలు తప్పుగా రాశారని చెప్పారు. వీటిని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, అర్హులైతే పథకాలు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. దరఖాస్తుల సంఖ్య 1.25 కోట్ల నుంచి 1.09 కోట్లకు పడిపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నకిలీ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నా.. సుమారు 13 లక్షల అప్లికేషన్లు తగ్గాయి.
దరఖాస్తు నమోదు కాలేదు
ప్రభుత్వం ఉచిత విద్యుత్తు, రూ.500కే ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించినా వర్తించకపోవడంతో బాధితులు విద్యుత్తు గ్యాస్ కార్యాలయాలకు పరుగులు తీశారు. అధికారులు వెబ్ పోర్టల్‌లో తనిఖీ చేసి ‘మీ పేరు లేదు’ అంటూ సమాధానం ఇచ్చారు. మండల కార్యాలయాలకు వెళ్లినా అదే సమా ధానం. అప్పటినుంచి బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మండ ల స్థాయి నుంచి ప్రజాభవన్ వరకు ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం కావ డంలేదని చెప్తున్నారు.
నాలుగు నెలలన్నారు.. ఊసే లేదు
ప్రజాపాలన దరఖాస్తులు ‘ప్రతి నాలుగు నెలలకు ఒకసారి దరఖాస్తులు స్వీకరిస్తాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు పెడతామని ఆర్భాటంగా చెప్పింది. ఇప్పటికి ఏడు నెలలు గడిచిపోయినా రెండో దఫా దరఖాస్తుల స్వీకరణ ఊసెత్తడం లేదు. మొదటి దఫా దరఖాస్తులు చేసుకున్నా నమోదు కానివారు, అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయినవారు రెండో అవకాశం కోసం ఎదు రు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెండో దఫా దరఖాస్తులు ప్రారంభించాలని కోరుతున్నారు.
వివరాలన్నీ గుట్టుగా..
ప్రజాపాలన దరఖాస్తులపై ప్రభుత్వం మొదటి నుంచీ వివరాలు వెల్లడించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజాపాలన ఆధారంగా గృహలక్ష్మి, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న ది. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంతమందికి అమలు చేస్తున్నారు? వంటి వివరాలేవీ బహిర్గతం చేయడం లేదని చెప్తున్నారు. దరఖాస్తులకు, అమలుకు మధ్య భారీగా వ్యత్యాసం ఉండటం వల్లే దాచి పెడుతున్నారని విమర్శిస్తున్నారు.