జహీరాబాద్, జూలై 10 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుప్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) కార్యాలయంపై గురువారం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. డీఎస్పీ కథనం ప్రకారం.. నిమ్జ్ ప్రాజెక్టు కోసం అధికారులు సేకరిస్తున్న భూ సేకరణలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హుస్సేలి గ్రామంలో షేక్ మహ్మద్ మగ్బూల్కు చెందిన పూర్వీకుల భూమికి సంబంధించిన పరిహారం చెక్కు ఇవ్వాల్సి ఉంది.
ఏడాదిగా నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ పరిహారం చెక్కును ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. చెక్కు కావాలంటే రూ. 65 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో బాధిత రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించగా వారు దాడులుచేసి ఆర్టీవో డ్రైవర్ దుర్గయ్య వద్ద రూ. 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్డీవో కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.