హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్‌రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం అల్వాల్‌లోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.31 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. రూ.43.79 లక్షల విలువచేసే నాలుగు ఓపెన్ ప్లాట్ల పత్రాలను, రూ.8.11 లక్షల విలువైన వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 190 తులాల బంగారం, రూ.4.22 లక్షల నగదును సీజ్ చేశారు.
సురేందర్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందిందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. దీంతో అల్వాల్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో రూ.2.31 కోట్ల ఆస్తులను గుర్తించామని వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. శంషాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పారు. సురేందర్‌రెడ్డి బావమరిది బినామీగా రెండు ఆస్తులను గుర్తించామన్నారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని చెప్పారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.