జనగామ, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 48 గంటల ఉపవాస దీక్షకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మాజీ చైర్మన్, బంజారా కీర్తిరత్న అవార్డు గ్రహీత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అభిమాన్ గాంధీనాయక్ సిద్ధమయ్యారు.
రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రూ. 2 లక్షల వరకు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ వినూత్నరీతిలో పండుగ పూట దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. సద్దుల బతుకమ్మ రోజు (గురువారం) ఉదయం 10 నుంచి దసరా పండుగ 12వ తేదీ ఉదయం 10 వరకు 48 గంటలపాటు పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం గిర్నితండాలోని తన నివాసంలో ఉపవాస దీక్ష చేస్తానని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పూర్తిస్థాయిలో రుణ మాఫీ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రాష్ట్రంలోని రైతులందరికీ రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్రెడ్డి కేవలం 40 శాతం మందికే అమలు చేశారని మండిపడ్డారు.