లక్నో : ఎస్పీ నేత ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సెక్రెటేరియట్ అబ్దుల్లా ప్రాతినిథ్యం వహిస్తున్న సువార్ నియోజకవర్గాన్ని ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. 15 సంవత్సరాల నాటి ఛజ్లయిత్ కేసులో ఆజంఖాన్తో పాటు ఆయన తనయుడు అబ్దుల్లాకు కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో పాటు రూ.3వేలచొప్పున జరిమానా విధించింది. ఇదే కేసులో ఏడుగురిని సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది.
2008 జనవరి 2న మాజీ ఎమ్మెల్యే ఆజంఖాన్ కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముజఫర్నగర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఛజ్లయిత్ పోలీస్స్టేషన్ ఎదుట తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారు. దీంతో ఆజంఖాన్తో పాటు అబ్దుల్లా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న ఎస్పీ కార్యకర్తలు, నేతలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణ ప్రజలను రెచ్చగొట్టి రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం, మొరాదాబాద్ దేహత్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హాజీ ఇక్రమ్ ఖురేషీ, బిజ్నోర్ నూర్పూర్ మాజీ ఎమ్మెల్యే నయీమ్ ఉల్ హసన్, ఎస్పీ ఎమ్మెల్యే నగీనా మనోజ్ పరాస్, అమ్రోహా ఎస్పీ ఎమ్మెల్యే మెహబూబ్ అలీ, రాజేష్ యాదవ్, డీపీ యాదవ్, మాజీ మెట్రోపాలిటన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ ప్రజాపతిని నిందితులుగా చేర్చారు. 2019 నుంచి మొరాబాద్లోని ఎంపీ-ఎమ్మెల్యేల కోర్టులో విచారణ జరుగుతుంది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఆజంఖాన్తో పాటు అబుద్దుల్లా ఆజంకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. సరైన సాక్షాధారాలు లేవని మిగతా వారిని విడుదల చేసింది.