
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిలో 40% మంది తీవ్ర రక్తస్రావం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరికి సకాలంలో ప్రాథమిక చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ‘ఏబీసీ (యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్)గురు’ పేరుతో క్రియాశీల రక్తస్రావ నియంత్రణపై శిక్షణ పొందిన వలంటీర్లు ఇప్పటివరకు 160 మంది ప్రాణాలు నిలిపారని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కే పాపారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల ద్వారా వెయ్యిమంది డ్రైవర్లు, పోలీసులు, షాప్కీపర్లు, రిక్షాకార్మికులకు శిక్షణ ఇచ్చామని, ఈ వలంటీర్ల క్షతగాత్రుల ప్రాణాలను కాపాడుతున్నారని చెప్పారు. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు శనివారం ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయంలో ఏబీసీగురును ప్రారంభించారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో పాపారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఏబీసీగురు శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని, వారి ద్వారా కుటుంబసభ్యులకు, ఇరుగుపొరుగు వారికి శిక్షణ అందించి సురక్షితమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. కరీంనగర్లో తన తండ్రి కృష్ణమనేని వెంకటరామారావు పేరిట ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఫర్ చిల్డ్రన్లో ఏబీసీగురును కరిక్యులమ్గా చేర్చి రికి అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా డాక్టర్ వినయ్ నందకర్ణి, డాక్టర్లు గీతాంజలి రామచంద్ర, విజయ్జమాల్పురి తదితరులు పాల్గొన్నారు. ఏబీసీగురు కార్యక్రమాన్ని జీవీకే ఈఎంఆర్ఐ, రోడ్ సేఫ్టీ క్లబ్ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తదితర సంస్థల భాగస్వామ్యంతో కలిసి నిర్వహిస్తున్నారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇన్సిట్యూట్ ఫర్ ది అడ్వాన్స్డ్ స్టడీ ఆఫ్ ఇండియా నిధులు అందిస్తున్నది.