నల్లబెల్లి, జూలై 30 : ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం అధికారుల నిర్వాకం ఓ మహిళా రైతుకు శాపంగా మారింది. తమ సంఘంలో సభ్యురాలు కానప్పటికీ ఆమె ఆధార్ నంబర్‌ను మరొకరి పేరిట నమోదు చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి లో మంగళవారం వెలుగుచూసింది. మండలంలోని నందిగామకు చెందిన బాధితురాలు భూక్యా సునీత కథనం మేరకు వివరాలిలా.. భూక్యా సునీతకు నర్సంపేట ఎస్బీఐలో ఖాతా ఉండటంతో 55 వేలు పంట రుణం తీసుకున్నది. మొదటి విడతలోనే రుణమాఫీ కావాల్సి ఉన్నా జాబితాలో పేరు లేకపోవడం తో అధికారుల చుట్టూ తిరుగుతున్నది. మంగళవారం నల్లబెల్లి రైతు వేదికలో హెల్ప్ డెస్క్‌కు వెళ్లి ఆరా తీసింది. ఎస్బీఐలో రూ. 55 వేలు, జిల్లా సహకార బ్యాంకులో రూ.1.33 లక్షలు, మొత్తం రూ.1.88 లక్షల రుణం ఉండటం వల్ల రుణమాఫీ కాలేదని తెలిపారు.
దీంతో నల్లబెల్లి పీఏసీఎస్ సీఈవోను సంప్రదించగా, అదే మండలం బిల్యానాయక్ తండాకు చెందిన భూక్యా సునీత పేరిట ఆధార్ నమోదై ఉన్నట్టు తెలిపారు.తనకు పీఏసీఎస్‌లో ఖాతా లేనప్పటికీ తన ఆధార్ నంబర్‌ను దొంగచాటుగా సేకరించి తన పేరుతో ఉన్న మరొకరికి ఎలా నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు న్యాయం చేయాలని పీఏసీఎస్ ఎదుట ఆందోళనకు దిగింది. కలెక్టర్‌ను కలిసి సరిదిద్దుకోవాలని సిబ్బంది చెప్పడంతో వెళ్లిపోయింది. పీఏసీఎస్ సిబ్బంది ఇలాగే అనేక మంది రైతుల ఆధార్ నంబర్లను ఇతరుల పేరిట నమోదు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేపడితే అవినీతి డొంక కదిలే అవకాశం ఉన్నట్టు బాధిత రైతులు అంటున్నారు.